English | Telugu
టీటీడీ డాలర్ల కుంభకోణం కేసు మళ్ళీ విచారణ జరపాలని ఆదేశాలు జారీ
Updated : Nov 27, 2019
తిరుమల శ్రీవారి ఆలయంలో 2006 లో వెలుగు చూసిన డాలర్ల కుంభకోణం అప్పట్లో పెద్ద దుమారాన్ని రేపింది. నిత్యం విక్రయించే బంగారు డాలర్లలో 300 బంగారు డాలర్లు గల్లంతయ్యాయి. డాలర్ల చోరీపై ప్రాథమికంగా టిటిడి విజిలెన్స్ అధికారులతో విచారణ జరిపించారు. ఈ కేసును విచారించిన విజిలెన్స్ అధికారులు డాలర్లు విక్రయించే షరాబు వెంకటాచలపతి పైనే అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించారు. అయితే వెంకటాచలపతి నేరం అంగీకరించకపోవటంతో శ్రీ వారి ఆలయంలో విక్రయించే డాలర్ల కౌంటర్ లో 300 డాలర్లు మాయమైనట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు టీటీడీ విజిలెన్స్ అధికారులు. విజిలెన్స్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో షరాబు వెంకటాచలపతితో పాటు అప్పటి బొక్కసం ఇన్ చార్జ్ డాలర్ శేషాద్రి, ఆలయ డిప్యూటీ ఈవో ప్రభాకర రెడ్డి, పేష్కార్ వాసుదేవన్ పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. వెంకటాచలపతి ఇంట్లో 3 బంగారు డాలర్లు లభించటంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీటీడీ అధికారులు షరాబు వెంకటాచలపతిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విచారణలో వెంకటాచలపతి నేరాన్ని ఒప్పుకున్నాడు. తప్పుడు లెక్కలు చూపి ఆ డబ్బును తన అవసరాల నిమిత్తం వినియోగించుకున్నానని చెప్పాడు.
అయితే డాలర్ కేసు అంతటితో ఆగలేదు. డాలర్లతో పాటు వేల కోట్ల విలువ చేసే శ్రీవారి ఆభరణాల కూడా మాయమైపోయాయని దీని వెనుక ఆభరణాల ఇన్ చార్జి డాలర్ శేషాద్రితో పాటు ఇతర అధికారుల పాత్ర ఉందన్న ఆరోపణలు వచ్చాయి. టీటీడీ అధికారులు శ్రీవారి ఆభరణాలన్నీ సురక్షితంగా ఉన్నాయని ఎన్ని ప్రకటనలు చేసిన ఆందోళనలు విమర్శలు ఆగడం లేదు.దీంతో డాలర్ల కుంభకోణం కేసును టిటిడి అధికారులు సీబీసీఐడీకి అప్పగించారు. విచారించిన సీబీసీఐడీ అధికారులు శ్రీవారి ఆభరణాలన్నీ సురక్షితంగానే ఉన్నాయని తేల్చి చెప్పారు.
2008 లో అప్పటి ఈవో రమణాచారి ఆదేశాలతో డాలర్ కుంభకోణం కేసును సీవీఎస్వో రమణ కుమార్ మళ్లీ విచారించారు. వెంకటాచలపతితో పాటు ఆలయ డిప్యూటీ ఈవో ప్రభాకర్ రెడ్డి, పేష్కార్ వాసుదేవన్, డాలర్ శేషాద్రికి కుంభకోణంలో సంబంధం ఉందని వెంటనే వారిని విధుల నుంచి తొలగించాలంటూ నివేదిక ఇచ్చారు. నివేదిక లీకవడంతో టిటిడి ఉద్యోగులు ఆందోళనకు దిగారు. నివేదిక తప్పుల తడకని డాలర్ శేషాద్రితో పాటు ఇతర ఉద్యోగులెవరికీ ఈ కేసుతో సంబంధం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. డాలర్ల కుంభకోణంకు సంబంధించి పలు విచారణలు దర్యాప్తుల అనంతరం 2014 లో రాష్ట్ర హై కోర్టు తుది తీర్పు ప్రకటించడం జరిగింది. కేసుకు సంబంధించి టిటిడి సీనియర్ అసిస్టెంట్ వెంకటాచలపతికి మూడేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధించింది. అలాగే కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న డాలర్ శేషాద్రితో పాటు మరి కొందరు అధికారులు నిర్దోషులుగా బయట పడ్డారు.
ఇక డాలర్ కుంభకోణం ముగిసిపోయిందని అంతా భావించగా రాష్ట్ర ప్రభుత్వం మరోసారి విచారణకు ఆదేశించడం చర్చనియాంశంగా మారింది. ప్రధాన నిందితుడు వెంకటాచలపతితో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న 16 మందిని విచారించి 3 నెలల్లో నివేదిక సమర్పించాలంటూ రిటైర్డ్ ఐపీఎస్ అధికారి సత్యనారాయణను ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు దేవాదాయ శాఖ కార్యదర్శి ఉషా రాణి ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఇందులో చెంచులక్ష్మి మృతి చెందటంతో 16 మంది ఉద్యోగులను అధికారులు విచారించనున్నారు. డాలర్ శేషాద్రితో పాటు ప్రభాకరరెడ్డి, వాసుదేవన్ కు క్లీన్ చిట్ లభించటంతో వారి పేర్లను తొలగించారు. ఎప్పుడో ముగిసిన కేసును తిరిగి తెరపైకి తేవడంతో రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయోనని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. మొత్తానికి తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలోనే ఈ బంగారు డాలర్ల కుంభకోణం ఓ మాయని మచ్చలా మిగిలిపోవడం ఖాయం.