English | Telugu
చర్చలు విఫలం... అర్ధరాత్రి నుంచి తెలంగాణలో ఆర్టీసీ బస్సులు బంద్
Updated : Oct 4, 2019
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె సైరన్ మోగనుంది. ఈ అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోనున్నాయి. తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీతో ప్రభుత్వం తరపున మంతనాలు జరిపిన త్రిసభ్య కమిటీ చర్చలు విఫలమయ్యాయి. దీంతో కార్మిక సంఘాల నేతలు యథాతథంగా ఇవాళ అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ సమ్మెను కొనసాగించనున్నట్టు ప్రకటించారు. ఆర్టీసీని బతికించడానికి జరుగుతున్న పోరాటం ఇదని, ఆర్టీసీని ప్రభుత్వమే కాపాడాలని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి కోరారు. ప్రభుత్వానికి కార్మికుల సమస్యను పరిష్కరించే ఉద్దేశం లేదని ఆయన ఆరోపించారు. నోటీసులకు ఆర్టీసీ కార్మికులు భయపడరని, సమ్మెకు అన్ని కార్మిక సంఘాలు మద్దతు తెలపాలని అశ్వత్థామరెడ్డి కోరారు.
ఇదిలా ఉంటే... ఆర్టీసీ కార్మికుల సమ్మెపై టీఎస్‌ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ స్పందించారు. సమ్మె చట్ట విరుద్ధం అని ఆయన చెప్పారు. సమ్మెలో ఉద్యోగులు పాల్గొంటే డిస్మిస్ చేస్తామని ఆర్టీసీ ఎండీ స్పష్టమైన హెచ్చరిక చేశారు. పండుగ సీజన్ కావడంతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తప్పేలా లేవు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో ఆర్టీసీ అధికారులు మునిగిపోయినట్టు తెలుస్తోంది.