English | Telugu

భారీ వర్షాల కారణంగా అతలాకుతలం అవుతున్న కర్నూల్ వాసులు...

బంగాళాఖతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రం అంతటా భారీ వర్షాలతో అల్లకల్లోలంను సృష్టిస్తున్నాయి. ఎడతెరుపు లేకుండా కురుస్తున్న వర్షాలు ఉపశమనం ఇస్తున్నాయి అనుకునేలోపే మళ్ళీ అల్ప పీడనంతో మరో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. ఇప్పటికే కర్నూలు జిల్లాను కూడా భారీ వర్షాలు వదలటం లేదు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు జిల్లా మొత్తం అతలాకుతలమైంది. పలు ప్రాంతాల్లో పంట పొలాలు నీట మునిగాయి. తాజాగా బనగానపల్లె సి బెళగల్ మండలాల్లో కురిసిన వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బనగానపల్లె మండలం పసుపుల గ్రామం వద్ద రోడ్డు తెగి పోవడంతో బనగానెపల్లె ప్యాపిలి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులతో పాటు ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తోంది.

అటు సిబెళగల్ మండలంలోని పలు గ్రామాల ప్రజలు మంచం పట్టారు. అంటువ్యాధులు ప్రబలుతున్నాయి. ప్రైవేటు వైద్యం చేయించుకునే స్థోమత లేని వారు సర్కారు దవాఖానాల్లో చికిత్స తీసుకోవాల్సి వస్తుంది. సి బెళగల్ ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో రోగులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. కరెంటు కోత మంచినీటి కొరత వల్ల వాళ్లు నరక యాతన అనుభవిస్తున్నారు. ఆరోగ్యం బాగోలేక వస్తే తమను పట్టించుకునే వారే లేరని అధికారుల తీరు పై రోగులు వారి బంధువులు మండిపడుతున్నారు. ఇక వరుణుడు ప్రభావం ఎలా ఉండబోతోందో చూడాలి.