English | Telugu
కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లోకి... మరుసటి రోజే తిరిగి కాంగ్రెస్ గూటికి
Updated : Oct 4, 2019
హుజూర్ నగర్ బైపోల్ వార్ గట్టిగా నడుస్తోంది, బరిలో నిలిచే అభ్యర్థులు ఫైనలయ్యారు. చేరికలపై పార్టీలు ఫోకస్ పెట్టడంతో రాజకీయ వేడి మరింత పెరిగింది. గ్రామస్థాయిలో అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు మారేవారు చాలా మంది కనిపిస్తున్నారు. గ్రామాలు, మండలాల వారీగా నేతలు దృష్టి పెట్టడంతో జంపింగ్ సీజన్ నడుస్తోంది. హుజూర్ నగర్ ఉప ఎన్నికలలో తలపడేది ఎవరో తేలిపోయింది. నామినేషన్ ల ఉపసంహరణకు గడువు ముగిసింది, మొత్తం ఇరవై ఎనిమిది మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. డెబ్బై ఆరు మంది నామినేషన్ లు వేస్తే నలభై ఐదు మంది నామినేషన్ లు తిరస్కరణకు గురయ్యాయి. సీపీఎం, ఎఎపి తో సహా కొంత మంది నామినేషన్ లు ఓకే కాలేదు.
ఉపసంహరణల వరకు ముప్పై ఒక్క మంది మిగిలారు. వారిలోను ముగ్గురు ఉపసంహరించుకున్నారు. ప్రస్తుతం బరిలో ఉన్నవారిలో టి.ఆర్.ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్యే ప్రధాన పోటీ ఉండబోతోంది. నామినేషన్ ల పర్వం కూడా ముగిసిపోవడంతో పార్టీలు ప్రచారంపై ఫోకస్ పెట్టాయి. ప్రస్తుతం చేరికలతో కేడర్ లో జోష్ పెంచాలని చూస్తున్నాయి. టీ.ఆర్.ఎస్, కాంగ్రెస్ రెండూ కిందిస్థాయిలో నేతలను చేర్చుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి. ప్రత్యర్థి కేడర్ పై కన్నేశాయి, తాజాగా పాలకవీడు జడ్పీటీసీ మోతిలాల్ టి.ఆర్.ఎస్ లో చేరారు.
మరుసటి రోజే తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు, ఈ సంఘటనతో చేరికలపై టీ.ఆర్.ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. హుజూర్ నగర్ లో మొదటిసారి గులాబీ జెండా ఎగురవేయటానికి వ్యూహాల్ని అమలు చేస్తోంది టి.ఆర్.ఎస్. పార్టీ ఇన్ చార్జ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నీ తానై యంత్రాంగాన్ని ముందుండి నడుపుతున్నారు. నియోజకవర్గంపై పూర్తిస్థాయిలో పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇదే సమయంలో చేరికలపై కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను ఖండిస్తున్నారు. నేతల ఆరోపణలు ఎలా ఉన్నా ఉప ఎన్నికతో కింది స్థాయి కేడర్ లో మాత్రం ఫుల్ జోష్ కనిపిస్తోంది.