English | Telugu
ట్యాంక్ బండ్ పై మిలియన్ మార్చ్ మంటలు... రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ అరెస్టులు
Updated : Nov 8, 2019
ఆర్టీసీ జేఏసీ ఛలో ట్యాంక్ బండ్ పిలుపు కేసీఆర్ సర్కారు గుండెల్లో గుబులుపుట్టిస్తోంది. మిలియన్ మార్చ్ తో సత్తా చాటేందుకు ఆర్టీసీ కార్మికులు ఉవ్విళ్లూరుతుండటంతో ప్రభుత్వం కంగారుపడుతోంది. ఆర్టీసీ కార్మికుల ఛలో ట్యాంక్ బండ్ ను విఫలం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అయితే, ఎలాగైనాసరే అనుకున్నది చేసి చూపించాలని ఆర్టీసీ జేఏసీ పట్టుదలగా ముందుకు కదులుతోంది.
ఆర్టీసీ ఛలో ట్యాంక్‌బండ్‌కు అనుమతి నిరాకరించిన పోలీసులు... రాష్ట్రవ్యాప్తంగా ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. జిల్లాల నుంచి ఎవరూ హైదరాబాద్ రాకుండా.... ఆర్టీసీ కార్మికులను కట్టడి చేస్తున్నారు. అలాగే, విపక్ష పార్టీల కార్యకర్తలు సైతం హైదరాబాద్ తరలిరాకుండా... ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు. జిల్లాల నుంచి హైదరాబాద్ కి వచ్చే అన్ని రహదారులను పోలీసులు తమ కంట్రోల్ లోకి తీసుకుంటున్నారు. పోలీసుల ముందస్తు అరెస్టులతో ఆర్టీసీ జేఏసీ నేతలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మరికొందరు తమ ఫోన్లు స్విచ్చాఫ్ చేసుకుంటున్నారు. అయితే, ఆర్టీసీ జేఏసీ కో-కన్వీనర్ రాజిరెడ్డిని హైదరాబాద్ విద్యానగర్‌లో పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. ఇక, ట్యాంక్ బండ్ తోపాటు హుస్సేన్ సాగర్ చుట్టూ పెద్దఎత్తున బలగాలను మోహరించారు. అనుమాం వస్తే చాలు అదుపులోకి తీసుకుంటున్నారు
ఛలో ట్యాంక్‌బండ్‌ను విఫలం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వద్దామరెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం, పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా, ఆటంకాలు కల్పించినా.... పెద్దఎత్తున తరలివచ్చి... కార్మికుల ఐక్యతను చాటాలని అశ్వద్ధామరెడ్డి పిలుపునిచ్చారు. పోలీసుల తీరుపై మండిపడ్డ అశ్వద్ధామరెడ్డి.... కార్మికుల ఇళ్లల్లోకి ప్రవేశించి అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని ఫైరయ్యారు. అయితే, ఎన్ని ఆంక్షలు విధించినా, నిర్బంధించినా.... ట్యాంక్‌బండ్‌పై జకల జనుల సామూహిక దీక్షలు నిర్వహించి తీరుతామని ప్రకటించారు. ఇక, ఆర్టీసీ జేఏసీ పిలుపుతో విపక్ష పార్టీలతోపాటు వివిధ ప్రజాసంఘాలు, విద్యార్ధి సంఘాలు.... ఈ మిలియన్ మార్చ్ లో పాల్గోనున్నాయి.