English | Telugu
కాసేపట్లో అయోధ్య తీర్పు... దేశవ్యాప్తంగా సూపర్ హైఅలర్ట్
Updated : Nov 8, 2019
దశాబ్దాలుగా కొనసాగుతోన్న అయోధ్య భూవివాదంపై మరికాసేపట్లో సుప్రీంకోర్టులో తుది తీర్పు ఇవ్వనుంది. రామజన్మభూమి, బాబ్రీ మసీదు స్థల వివాదంపై చరిత్రాత్మక తీర్పును ఇవ్వబోతోంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పును వెలువరించనుంది.
సుప్రీంకోర్టు చరిత్రలోనే అత్యంత సుదీర్ఘంగా సాగిన రెండో కేసుగా ఇది రికార్డులకెక్కింది. అయోధ్యలో 2.77 ఎకరాల వివాదాస్పద భూమిని... నిర్మోహి అఖాడ, రాంలాల్ విరాజ్‌మని, సున్నీ వక్ఫ్ బోర్డుకు సమానంగా పంచుతూ... అలహాబాద్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలుచేస్తూ... దాఖలైన 14 పిటిషన్లపై సుప్రీంకోర్టు సుదీర్ఘకాలం విచారణ జరిపింది. 2019 ఆగస్ట్ 6నుంచి అక్టోబర్ 16వరకు మొత్తం 40రోజులపాటు బహిరంగ విచారణ జరిగింది. సీజేఐ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం వాదనలు వింది.
హిందువుల నమ్మకం ప్రకారం ఇది రామజన్మభూమిగా కొనసాగుతోందని, అలాగే రామాలయానికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయని హిందూ వర్గమైన రాంలాలా విరాజ్‌మని తరపున న్యాయవాదులు వాదించారు. బాబర్ వచ్చి మసీదును నిర్మించాక... ఇక్కడ ప్రతి శుక్రవారం ప్రార్థనలు జరిగేవని సున్నీ వక్ఫ్ బోర్డు ధర్మాసనానికి నివేదించింది. ఈ పిటిషన్లతోపాటు పలు వ్యక్తిగత, హిందూసభ, వీహెచ్‌పీ తదితర పిటిషన్లపైనా వాదనలు జరిగాయి. అనంతరం రాతపూర్వకంగా వాదనలను కూడా సుప్రీం ఇవాళ తుది తీర్పు ఇవ్వబోతోంది.
అయోధ్య తీర్పుపై దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అయితే, తీర్పు ఎవరికి అనుకూలంగా వచ్చినా తమకు సమ్మతమేనని ఇటు హిందూ సంస్థలు.... అటు ముంస్లిం వర్గాలు చెబుతున్నాయి.