English | Telugu
40 టన్నుల ఉల్లి చోరి.. ఉల్లి ధర పెరగడమే దోపిడీకి దారి తీసింది
Updated : Nov 30, 2019
దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు అమాంతం పెరిగిపోయాయి. ప్రధాన నగరాల్లో కిలో ఉల్లిగడ్డ 100 రూపాయలు దాటి పలుకుతోంది. ఈ పరిణామం పేద, మధ్య తరగతి ప్రజలపై పెను ప్రభావం చూపిస్తోంది. దీంతో కిలో ఉల్లిపాయలు కొనే వినియోగదారుడు ఇప్పుడు కేవలం పావు కిలోతో సరిపెట్టుకుంటున్న దుస్థితి దాపురించింది. ఉల్లి లేకుంటే ఇల్లు గడవదని ఇంతలా ధరలు పెరిగితే రోజువారీ జీవితాలు సాగడం కష్టమంటూ మహిళలు ఆవేదన చెందుతున్నారు.
డబ్బులు, బంగారం, వజ్రాలు, విలువైన వస్తువులు చోరీ కావడం చూస్తూనే ఉంటాం. కానీ ఇప్పుడు వాటి జాబితాలో ఉల్లిపాయలు కూడా చేరాయి. ఉల్లి ధరలు ఆకాశాన్నంటడంతో దొంగలు పక్కన నగదు పెట్టెలు ఉన్నప్పటికీ వాటిని కనీసం తాకను కూడ తాకకుండా కేవలం ఉల్లిపాయలను మాత్రం దొంగతనం చేస్తున్న సంఘటనలు ఇటీవల చోటుచేసుకుంటున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్ లో దుండగులు 40 టన్నుల ఉల్లిపాయలు ఉన్న ట్రక్కును దొంగిలించారు. వాటి విలువ సుమారు 22 లక్షల వరకు ఉంటుంది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని శివపురిలో జరిగింది. ఇటు మరో చోట అయితే షాపు లోకి దూరిన దుండగులు డబ్బులు జోలికి వెళ్లకుండా ఉల్లిపాయల దొంగతనం చేసుకుని వెళ్ళిపోయారు.
ఇదీ విషయం.. చివరకు ఉల్లి దొంగతనాలు చేసే వరకూ పరిస్థితి వెళ్లింది. మరో వైపు ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు ఈజిప్టు నుంచి దిగుమతి చేసుకోవటానికి ప్రయత్నిస్తోంది కేంద్రం. డిసెంబరు మొదటి వారం లోపు దేశానికి సరుకు చేరుకుంటుంది అంటున్నారు మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్. ఉల్లి ధరల అదుపునకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోంది అంటున్నారు. మరోవైపు ఈ ఉల్లిఘాటు జార్ఖండ్ ఎన్నికలపై ప్రభావం చూపుతుందా అన్న భయాలు బిజెపిని వెంటాడుతున్నాయి.