English | Telugu

ఐ డోంట్ కేర్... కూల్చిన కబ్జా గోడను మళ్ళీ కట్టిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే 

ఎన్ని ఆరోపణలు వచ్చినా కొంతమంది టీఆర్ఎస్ నాయకులు ఎంత మాత్రం వెనక్కు తగ్గడం లేదు. భూ కబ్జాలు, అధికారుల పై జులుం వంటి ఘటనలకు సంబంధించి కొంత కాలంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పై తీవ్ర ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇదే వరుసలో జ‌న‌గామ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాద‌గిరి రెడ్డిపై ఇప్పటికే ఎన్నో భూక‌బ్జా ఆరోప‌ణ‌లు వచ్చాయి. ఆయ‌న తన ఇలాకాలోని ప్ర‌భుత్వ స్థ‌లాల‌ను, చెరువు భూముల‌ను వ‌ద‌లిపెట్ట‌ర‌ని స్థానికంగా అనేక ప్ర‌చారాలున్నాయి. తాజాగా చేర్యాల మండ‌లం పెద్ద చెరువు మ‌త్త‌డి స్థ‌లాన్ని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి క‌బ్జా చేసి, ఆయ‌న కూతురు పేరుపై రిజిస్ట్రేష‌న్ చేశార‌ని జ‌న‌గాంలో అఖిల‌ప‌క్ష నాయ‌కులు ఆరోపించారు. దీనిపై వారు చేర్యాల బంద్ కు కూడా పిలుపునిచ్చి నిన్న (శుక్ర‌వారం) అక్క‌డ నిర్మించిన ప్ర‌హ‌రీగోడ‌ల‌ను కూల్చివేశారు. దీంతో ఎమ్మెల్యే గారు బుద్ధి తెచ్చుకుని వెన‌క్కి త‌గ్గుతార‌ని స్థానిక ప్రజలు నాయకులు భావించారు. అయితే ఎమ్మెల్యే గారు ఏమాత్రం వెనక్కు తగ్గకుండా నిన్న రాత్రికి రాత్రే కూల్చిన గోడను మ‌ళ్లీ నిర్మించేశారు. అంతేకాకుండా పోలీస్ ప‌హారాలో అయన గోడ తిరిగి నిర్మించార‌ని, అయినా ఎమ్మెల్యే పదవిలో ఉండి మ‌రీ ఇంత బ‌రితెగిస్తారా అంటూ ఇటు స్థానిక నాయ‌కులు ప్ర‌జ‌లు ముత్తిరెడ్డిపై మండిప‌డుతున్నారు.