English | Telugu

దేశంలో క‌రోనా పాజిటివ్ బాధితుల సంఖ్య 886

కొత్త కేసుల సంఖ్య దేశంలో క్రమంగా పెరుగుతోంది. కరోనా వైరస్ కేసులు దేశంలో వెలుగుచూసిన తర్వాత తొలిసారి శుక్రవారం అత్యధికంగా 150కిపైగా కేసులు నమోదుకావడం ఆందోళన గురిచేస్తోంది.

శుక్రవారం కేరళలో అత్యధికంగా 39 కేసులు నమోదు కాగా, ఆ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 176కి చేరింది. దీని తర్వాతి స్థానంలో 156 కేసులతో మహారాష్ట్ర నిలిచింది. కరోనా బాధితుల్లో ఇప్పటి వరకు 76 మంది కోలుకోగా, 20 మంది మృతిచెందారు. ప్రస్తుతం 791 మంది హాస్పిటల్స్‌లో చికిత్స పొందుతున్నారు.

ఒక్క రోజు 10 కేసులు నమోదుకావడంతో తెలంగాణలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 59కి చేరింది. మార్చి 2న రాష్ట్రంలో తొలికేసు నమోదైన తర్వాత.. ఒక రోజులో 10కిపైగా కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. వీరిలో ఓ వ్యక్తి కోలుకొని ఇంటికెళ్లగా, మిగిలిన వారు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

కరోనా వైరస్‌ ఉన్నట్లు గుర్తించిన వారిలో ఓ కార్పొరేట్‌ ఆసుపత్రి వైద్యుడి తల్లి కూడా ఉన్నారు. దీంతో వైద్యులైన భార్యాభర్తలతో పాటు వారి కుటుంబంలో ఇప్పుడు తల్లికి కూడా సోకినట్లయింది. ఆ వైద్యుడి తండ్రికి, ఇద్దరు చిన్నారులకు నిర్వహించిన పరీక్షల ఫలితాలు ఇంకా వెల్లడి కావలసి ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో రెండు కరోనా వైరస్ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 13కు చేరింది. ఇటీవలే ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్‌ నుంచి విశాఖపట్నం వచ్చిన కుటుంబ సభ్యుల్లో ఒకరికి కరోనా పాజిటివ్‌గా గుర్తించారు. దీంతో అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మిగతా కుటుంబ సభ్యులు ప్రస్తుతం ప్రత్యేక ఐసోలేషన్‌లోనే ఉన్నట్లు వైద్య అధికారులు తెలిపారు. విశాఖలో కరోనా బాధితుల సంఖ్య నాలుగుకు చేరుకుంది.