English | Telugu

విజృంభిస్తున్న కరోనా సెకండ్ వేవ్‌! వణికిపోతున్న ఢిల్లీ జనం 

దేశ రాజధాని ఢిల్లీని కరోనా మహమ్మారి మళ్లీ షేక్ చేస్తోంది. గతంలో తగ్గినట్లు కనిపించిన కేసులు.. కొన్ని రోజుల నుంచి మళ్లీ పెరిగాయి. వారం రోజులుగా వైరస్ వ్యాప్తి మరింత తీవ్రమైంది. కరోనా మహమ్మారి వ్యాప్తి తరువాత తొలిసారిగా డిల్లీలో 6వేలను దాటేసాయి. రోజువారీ కేసుల సంఖ్య 6000 మార్కును దాటడం ఇదే మొదటిసారి. తాజాగా వచ్చిన 6 వేల 700 సులతో మొత్తం కరోనా సంఖ్య 4 లక్షలను అధిగమించింది. అంతకుముందు అత్యధిక సింగిల్డే స్పైక్ అక్టోబర్ 30 న 5 వేల 891 కరోనా కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో మ‌ళ్లీ మునుపెన్నడూ లేని విధంగా పెరుగుతున్నక‌రోనా పాజిటివ్ కేసులు ఆందోళన రేపుతున్నాయి.

ఢిల్లీలో కోవిడ్-19 కేసుల సంఖ్య పెరుగుతోందని, ఈ విస్త‌ర‌ణ‌ను థ‌ర్డ్ వేవ్‌గా చెప్ప‌వ‌చ్చ‌ని రాష్ట్ర ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ తెలిపారు. పండుగ సీజన్, కాలుష్య స్థాయి పెరుగుతున్న మధ్య కేసులలో అకస్మాత్తుగా పెరిగినట్టు తెలుస్తోందని చెప్పారు. కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండంతో ఢిల్లీ అధికార యంత్రాంగం అప్ర‌మ‌త్త‌మైంద‌ని సీఎం కేజ్రివాల్ తెలిపారు. ప‌రిస్థితిని తాము ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్షిస్తున్నామ‌ని, మునుప‌టిలా కొత్త కేసులు విజృంభించ‌కుండా అవ‌స‌ర‌మైన‌ అన్ని చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపారు సీఎం కేజ్రీవాల్.

ఇప్పటికే భయంకరమైన కాలుష్యంతో అల్లాడిపోతున్న ఢిల్లీ ప్రజలు కరోనా మహమ్మారి విజృంభణతో వణికిపోతున్నారు, ఇండ్ల నుంచి బయటికి రావాలంటేనే జంకుతున్నారు. శీతాకాలానికి సంబంధించిన శ్వాసకోశ సమస్యలు, బయటి నుండి పెద్ద సంఖ్యలో రోగులు రావడం, పండుగ సీజన్‌ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని రోజుకు సుమారు 15 వేల కరోనా పాజిటివ్‌ కేసులకు సిద్ధం కావాలని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఒక నివేదికలో ఇటీవల హెచ్చరించింది. దీంతో అప్రమత్తమైన యంత్రాంగం అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టింది.