English | Telugu

మందడంలో కూలిన మూడు శిబిరం! ప్రకృతికి నచ్చలేదన్న ఆర్ఆర్ఆర్

జగన్ సర్కార్ తలపెట్టిన మూడు రాజధానులకు మద్దతుగా అమరావతిలోని మందడంలో ఏర్పాటు చేసిన శిబిరం కూలిపోయింది. నిన్న సాయంత్రం కురిసిన గాలి, వానకు ఆ శిబిరం టెంట్ కుప్పకూలిపోయింది. మందడం సీడ్ యాక్సిస్ రోడ్ వద్ద ఏర్పాటు చేసిన ఈ శిబిరం కూలినప్పుడు అందులో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. శిబిరం ఖాళీ చేశాక టెంట్ కూలిపోవడంతో నిర్వాహకులు, శిబిరంలో పాల్గొనేవారు ఊపిరిపీల్చుకున్నారు. ఈ రోజు ఉదయం ఈ శిబిరం ప్రారంభం కావాల్సి ఉంది.

నవ్యాంధ్ర రాజధాని అమరావతి తరలింపును నిరసిస్తూ 323 రోజులుగా రైతులు, కూలీలు, మహిళలు దీక్షలు, ధర్నాలు, నిరసనలు చేపడుతున్నారు. వీరి దీక్షలకు పోటీగా మూడు రాజధానులను సమర్థిస్తూ.. ఏపీ వ్యాప్తంగా 30 లక్షల మందికి సెంటు ఇంటి స్థలం ఇవ్వాలని కోరుతూ మందడంలో ఈ పోటీ శిబిరాలను ఏర్పాటు చేశారు. మూడు రాజధానులకు మద్దతుగా మందడంలో వేసిన శిబిరం కూలిపోవడంపై ప్రజల్లో ఆసక్తి కర చర్చ జరుగుతోంది. జగన్ సర్కార్ నిర్ణయం ప్రకృతికి నచ్చడంలేదని జనాలు అభిప్రాయపడుతున్నారు. 320 రోజులపైగా అమరావతి రైతులు ధీక్షలు చేస్తున్నా ఎలాంటి ఘటనలు జరగలేదని, ఇప్పుడు ఈ టెంట్ వేస్తుండగానే కూలిపోయిందని చెప్పుకుంటున్నారు.

నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు కూడా అలానే స్పందించారు. ప్రకృతి కూడా కొన్ని కొన్ని దుష్ట శక్తుల్ని ప్రొత్సహించదని అనటానికి ఉదాహరణగా పడిపోయిన డేరాల ఫోటోను ఆయన చూపించారు. పడిపోయిన డేరాలు ఏంటంటే... మూడు రాజధానులు కావాలని ఆటో పెయిడ్ ఆర్టిస్టుల కోసం నిర్మించిన డేరాలని.. ఆ డేరాలు కూలిపోయాయని రఘురామ అన్నారు. నిజమైన రైతులు రాజధాని అమరావతి కోసం ఎక్కడ ఆందోళన చేస్తున్నారో.. అక్కడ చిన్న గడ్డిపరక కూడా చెక్కు చెదరలేదని రాఘురామ వ్యాఖ్యానించారు. దీన్ని బట్టి న్యాయం ఎటువైపు ఉందో ఒక్కసారి ఆలోచించాలన్నారు. ప్రకృతికి మించిన శక్తి లేదని, ప్రకృతి ఏం చెప్పిందన్నది గహించాలన్నారు రఘురామ కృష్ణం రాజు.