English | Telugu

పవన్ కల్యాణ్ మసాలా ఫ్లేవర్ లాంటివాడ‌ట‌!

ఇటీవలే బీజేపీతో పొత్తు కుదుర్చుకున్న జనసేనాని పవన్ కల్యాణ్ పై బీజేపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి పవన్ కల్యాణ్ మసాలా ఫ్లేవర్ లాంటివాడని అభివర్ణించారు. బీజేపీకి ఉన్న క్యాడర్ పవన్ కల్యాణ్ కు ఉపయోగపడుతుందని అన్నారు. ఇక, బీజేపీ భావాలకు అనుకూలంగా ఉన్నంతకాలం వైసీపీకి త‌మ మద్దతు ఉంటుందని వ్యాఖ్యానించారు.

కర్నూలులో హైకోర్టును బీజేపీ స్వాగతిస్తుందని టీజీ తెలిపారు. బీజేపీ డిమాండ్ ను జగన్ అమలు చేస్తున్నప్పుడు ఎందుకు వ్యతిరేకించాలని అన్నారు. బీజేపీలో ఎలాంటి గ్రూపులు లేవని స్పష్టం చేశారు.

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో భార‌తీయ జ‌న‌తా పార్టీ ఒంట‌రిగా పోటీ చేయ‌కుండా ప‌వ‌న్‌తో క‌లిసి ఎన్నిక‌ల్లో దిగింది. అయితే ఏడాది క్రితం జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వ‌చ్చిన ఓట్లు అయినా వ‌స్తాయా? అని బిజెపి నేత‌లు మ‌ద‌న‌ప‌డుతున్నారు.

సినీ గ్లామర్ తో రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావించిన పవన్ కళ్యాణ్ కు గత ఎన్నికల్లో నిరాశ ఎదురైంది. సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి అధికార పీఠం దక్కించుకోవాలి. లేకుంటే కనీసం కింగ్ మేకర్‌గా ఉండాలనుకున్న పవర్ స్టార్‌కు ఆంధ్ర ఓటరు షాక్ ఇచ్చారు.

రాష్ట్ర రాజకీయాల్లో తన స్థానాన్ని నిలుపుకోవాలని భావించిన ఆయన బీజేపీతో జట్టుకట్టారు. రాష్ట్రంలో ఒక్కశాతం ఓట్లు కూడా లేని బీజేపీతో జట్టు క‌ట్టారు. ఇక స్థానిక సమరంలో తన పవర్ చాటాలనుకుంటున్నారు ప‌వ‌ర్ స్టార్‌.

స్థానిక పోరులో తమ జట్టు గెలుపు సాధిస్తుందనే విశ్వాసంతో ఆయ‌న ముందుకు పోతున్నారు. ఎన్నికలను ఎదుర్కొనేందుకు పార్లమెంటరీ నియోజక వర్గాల వారీగా ఇన్ ఛార్జిల నియామకం కూడా జ‌న‌సేన పార్టీ పూర్తి చేసింది.

పవన్ ఎంతగా తాపత్రయపడినా స్థానిక సమరంలో విజయం అంత సులభం కాకపోవచ్చనేది రాజకీయ వర్గాల మాట. అందుకు కారణాలు కూడా చెపుతున్నారు. వెల్ఫేర్ స్కీంలతో మంచి దూకుడు మీదున్న వైసీపీని ఎదుర్కోవడం అంత సులభం కాదు.

ఉత్తరాంధ్ర జిల్లాల్లో జ‌న‌సేన పార్టీకి కొంత పట్టున్నా, ఇటీవల పరిపాలనా వికేంద్రీకరణతో ఆ ప్రాంతంలో కూడా వైసీపీ బలం పుంజుకుంది. ప్రధాన ప్రతిపకం టీడీపీ కూడా ఎన్నికలను ఎదుర్కోవడంపై తర్జనభర్జనలు పడుతుండగా జనసేన సత్తా చాటాలనుకోవడం అత్యాశే అవుతుందంటున్నారు విశ్లేష‌కులు. స్థానిక ఎన్నికలు అయ్యేవరకు సినిమా షూటింగ్‌లను కూడా ఆపి రాజకీయ వ్యవహారాలలో తలమునకలవుతున్నారు జ‌న‌నేత‌.

స్థానిక ఎన్నిక‌ల్లో ప్రశ్నించటానికి వస్తున్న జ‌న‌నేత‌ను, అదే.... మసాలా ఫ్లేవర్ ను ప్రజలు ఆదరిస్తారా? ప‌వ‌న్ తన ఉనికిని నిలబెట్టుకుంటాడా? ఈ విష‌యాన్ని టీజీ వెంకటేశ్ యే చెప్పాలి.