English | Telugu
ఈయన కూడా కోపం నరం తెంచేసుకున్నారా?
Updated : Mar 11, 2020
ఈయన కూడా తన తండ్రి మాదిరే కోపం నరం తెంచేసుకున్నారా? తన కుటుంబం మీద ఉన్న ఫ్యాక్షన్ ముద్ర చెరిగిపోవటానికి రాజీ ఫార్ములాను ఔపోసన పట్టేశారా ? గడిచిన వారం రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే, జగన్ మోహన్ రెడ్డి రూటే మొత్తంగా మారిపోయినట్టు కనిపిస్తోంది. తన మీద, తన వ్యవహార శైలీ మీద తెలుగు దేశం అనుకూల మీడియా, అలాగే జాతీయ మీడియా లోని కొన్ని ప్రభావశీల మీడియా సంస్థలు తాను అధికారం చేపట్టకమునుపు నుంచీ చేస్తున్న దాడులకు సమాధానం ఇవ్వటం కోసమే అన్నట్టుగా, జగన్ మోహన్ రెడ్డి చాలా వేగం గా పావులు కదుపుతూ ముందుగా తన సొంత జిల్లా నుంచే రాజకీయ వలసలను, అది కూడా ప్రత్యర్థి శిబిరాల నుంచి రాజకీయ వలసలను ప్రోత్సహిస్తూ వస్తున్నారు. అసలు..తనను చూసేందుకు కూడా ఇష్టపడని వారిని సైతం ఆయన అక్కున చేర్చుకుంటున్న విధానం అందరినీ ఆశర్య పరుస్తోంది. అలాంటి వారికి ఇప్పుడు సొంత పార్టీలోకి రెడ్ కార్పెట్ వేసి మరీ ఆహ్వానించటం పై ఆసక్తి కర చర్చ సాగుతోంది. నాడు వైయస్సార్ హయాంలోనే సతీష్ రెడ్డి తన తండ్రి హత్య కేసులో ముద్దాయి అయినా...తాము ఎటువంటి ప్రతీకార చర్యలకు పోలేదని పదే పదే చెప్పేవారు. ఇప్పుడు అదే సతీష్ రెడ్డి వై ఎస్ ఆర్ సి పి లో చేరటానికి జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
జమ్మల మడుగులోనూ రాజకీయ వర్గ పోరు రెండు వైపులా నష్టం కలిగించిన విషయాన్నీ గుర్తు చేసుకున్న జగన్ మోహన్ రెడ్డి, ఫ్యాక్షన్ రాజకీయలకు ముగింపు పలికేందుకు వ్యూహాత్మక ఎత్తుగడతో ముందుకు కదులుతున్నారు. నాడు వైయస్సార్ ముఖ్యమంత్రి అయ్యే వరకూ ఆయననూ ఫ్యాక్షన్ నేతగా విమర్శించేవారు. అయితే, ముఖ్యమంత్రి అయిన తరువాత తన కోపం అనే నరాన్ని తెంచేశానని వైయస్ చెప్పుకొచ్చేవారు. ఇక, వైయస్ సీఎంగా ఉన్న సమయంలో కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తున్న ఇద్దరు కీలక నేతల మధ్య తనంతటగా తాను రాజీ కుదిర్చి అక్కడ ఫ్యాక్షన్ లేకుండా చేశారు. కర్నూలు జిల్లాలో కాటసాని, బిజ్జం కుటుంబాల మధ్య ఫ్యాక్షన్ తగదాలు ఉన్నాయి. అయితే అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రెండు కుటుంబాల మధ్య రాజీ కుదిర్చారు. దీంతో అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్న బిజ్జం వ్యాపారాలకు పరిమితమయ్యారు. 2019 ఎన్నికల్లో నంద్యాల నుండి పోటీ చేయాలని ప్రయత్నించారు. జగన్ మోహన్ రెడ్డి సమక్షం లో పార్టీ లో సైతం చేరారు. పాణ్యం సీటు కాటసాని రాంభూపాల్ రెడ్డికి వై ఎస్ ఆర్ సి పి అధ్యక్షుడు కేటాయించారు. ఇహ, అలాగే, మొదటి నుంచి కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న రామసుబ్బారెడ్డి కుటుంబం ఇప్పుడు జగన్ సమక్షంలో వై ఎస్ ఆర్ సి పి లో చేరుతోంది.
ఇలా, ఫ్యాక్షన్ రాజకీయాలకు చెక్ పెట్టడంతో పాటు, తన కుటుంబంతో దశాబ్దాల తరబడి వైరం కొనసాగిస్తున్న రాజకీయ ప్రత్యర్థులను వై ఎస్ ఆర్ సి పి గొడుగు కిందకు తీసుకు రావటం ద్వారా, విపక్ష తెలుగు దేశాన్ని అయోమయం లో పడేయాలనేది జగన్ మోహన్ రెడ్డి వ్యూహం గా కనిపిస్తోంది.