English | Telugu
రగులుతున్న జమ్మూ కశ్మీర్.. మళ్ళీ ఉగ్రవాదుల దాడి
Updated : Oct 15, 2019
ఆర్టికల్ 370 రద్దు విషయంలో జమ్మూ కశ్మీర్ లో తీవ్ర పరిస్థితులు నెలకొన్న సమయంలో 144 సెక్షన్ కూడా విధించారు. కశ్మీర్ మొత్తం పోలీసులు ఆద్వర్యంలోనే ఉంది. జమ్మూ కశ్మీర్ లో పరిస్థితులు సాధారణ స్థితికి వస్తున్నాయి అనుకుంటున్న తరుణంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. షోపియన్ జిల్లాలో ఒక ట్రక్ డ్రైవర్ ని ఉగ్రవాదులు కాల్చి చంపేశారు. పండ్ల వ్యాపారిపై దాడి చేశారు. షోపియాన్ ఘటనలో ఒక పాకిస్థానీ యువకుడు కూడా పాల్గొన్నట్టు జమ్ము కశ్మీర్ పోలీసులు చెబుతున్నారు. జమ్మూ కశ్మీర్ లో ఉద్రిక్త పరిస్థితులు సృష్టించేందుకు మాటువేసిన ఉగ్రవాదులు అమాయక ప్రజలను పొట్టన బెట్టుకుంటున్నారు.
ఆర్టికల్ 370 రద్దు తరవాత రెండున్నర నెలలుగా కశ్మీరు మొత్తం నిఘా నీడలోనే ఉంది. పరిస్థితులు సద్దుమణగడంతో ఆంక్షలను ప్రభుత్వం సడలిస్తూ వస్తోంది. సెల్ ఫోన్ సర్వీసులను పునురుద్ధరించిన రోజే ఉగ్రమూకలు పేట్రేగిపోయాయి. పండ్ల వ్యాపారులను ఎగుమతి దారులను టార్గెట్ గా చేసుకుని దాడులకు పాల్పడ్డారు. షోపియాన్ జిల్లాలో షరీఫ్ ఖాన్ అనే ట్రక్ డ్రైవర్ ను దారుణంగా ఉగ్రవాదులు హత్య చేశారు. జమ్ము కశ్మీర్ లోకి అక్రమంగా చొరబడిన ఇద్దరు పాకిస్తానీ మిలిటెంట్ లు ఈ దారుణానికి ఒడిగట్టారు. రాజస్థాన్ కు చెందిన షరీఫ్ ఖాన్ జమ్ము కశ్మీర్ లో ట్రక్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత కాశ్మీర్ వ్యాలీలో పండ్లు ఎగుమతి పుంజుకోవడంతో చాలా మందికి ఉపాధి దొరికింది. దీన్నే అదునుగా తీసుకొని మిలిటెంట్ లు రెచ్చిపోతున్నారు. షోపియాన్ జిల్లాలో ఉగ్రవాదుల దాడితో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. సరిహద్దుల్లో భద్రతను కట్టు దిట్టం చేశాయి. ఉగ్రవాదులతో పాటు చొరబాటుదారుల కదలికలపై నిఘా పెంచాయి. దాడికి పాల్పడిన మిలిటెంట్ లలో పాకిస్థాన్ జాతీయుడు కూడా ఉండటంతో పాక్ కు వ్యతిరేకంగా బలగాలు సాక్ష్యాలను సిద్ధం చేస్తున్నాయి.