English | Telugu

సమస్యను పరిష్కరించే వరకు బాబు అంత్యక్రియలు చేయం: ఆర్టీసీ జేఏసీ

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడమే ప్రధాన ఎజెండాగా కార్మిక జేఏసీ చేపట్టిన సమ్మె 28వ రోజుకు చేరుకుంది. ఆందోళనలో భాగంగా ఇవాళ కార్మిక జేఏసీ ఛలో కరీంనగర్ కు పిలుపునిచ్చింది. మరోవైపు పొలిటికల్ జేఏసీ జిల్లా బంద్ చేపట్టాలని కోరడంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కొంత టెన్షన్ వాతావరణం నెలకొంది. విద్యాసంస్థలు, వ్యాపార సముదాయాలు బందుకు మద్దతు తెలిపాయి.రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్మికులు పెద్ద ఎత్తున కరీంనగర్ కు రావడంతో జిల్లా వ్యాప్తంగా భారీ పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. ఇక జిల్లాలో గుండె పోటుతో మరణించిన ఆర్టీసీ డ్రైవర్ నంగునూరి బాబు అంత్యక్రియలు కూడా నిలిపివేశారు కుటుంబ సభ్యులు. వేలాది కార్మికులు కోరుతున్నట్లుగా ప్రభుత్వం ఆర్టీసీ జేఏసీతో చర్చలు జరిపిన తర్వాతే అంతిమయాత్ర మొదలు పెడతామని జేఏసి రాజకీయ పక్షాలు తేల్చి చెప్పడంతో జిల్లాలో పరిస్థితి ఆందోళనగా మారింది.

బాబు మృతదేహాన్ని ఆరేపల్లి లోని అతని ఇంటి దగ్గరే ఉంచారు. జిల్లాలో జరుగుతున్న ఆర్టీసీ కార్మికుల ఆందోళనకు స్థానిక ఎంపీ సంజయ్ సంపూర్ణ మద్దతు తెలిపి.. బాబు కుటుంబ సభ్యులను పరామర్శించారు.పెద్ద సంఖ్యలో అఖిల పక్షం నేతలు ఆర్టీసీ జేఏసీ నేతలు కూడా ఆరెపెల్లికి చేరుకుంటున్నారు. అదేవిధంగా కరీంనగర్ నగర బంద్ కూడా కొనసాగుతుంది. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు మాత్రం భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.సుమారుగా 40 గంటల పాటు కూడా బాబు మృతదేహం ఆరేపలల్లిలోనే ఉంది. తమ సమస్య పరిష్కారమయ్యేంతవరకు అంత్యక్రియలు చేయమని ఇటు ఆర్టీసీ జేఏసీ నేతలతో పాటు ఎంపీ సంజయ్ కూడా తేల్చి చెప్పేశారు.