English | Telugu

హైకోర్ట్ ఆర్డర్.. మునిసిపాలిటీ ఎన్నికలపై అభ్యంతరాలకు 7 రోజుల గడువు

మున్సిపల్ ఎన్నికలకు లైన్ క్లియర్ అయ్యింది. 73 మున్సిపాలిటీల స్టే రిట్ పిటిషన్ పై విచారణ జరిపి స్టే ఎత్తివేస్తున్నట్లుగా సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది. మున్సిపల్ ఎన్నికల అభ్యంతరాలపై దాఖలైన పిటిషన్ ను విచారణ చేసింది న్యాయస్థానం. నవంబర్ 30 నుంచి 7 రోజుల్లోగా అభ్యంతరాలను స్వీకరించి 14 రోజుల్లోగా సవరణలు ముగించాలని మునిసిపల్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేసింది. గత జూలైలో ఇచ్చిన మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ ను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది హైకోర్ట్. వార్డుల విభజన, ఓటర్ల జాబితా సవరణ మళ్లీ చేపట్టి కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది హైకోర్ట్.

అయితే మీర్ పేట మునిసిపల్ కార్పొరేషన్ వార్డుల విభజన ప్రక్రియ ఇంకా మొదలు పెట్టలేదని కోర్టుకు తెలిపింది ప్రభుత్వం. మునిసిపాలిటీలపై అభ్యంతరాలను పరిష్కరించిన తర్వాతే కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని సూచించిందన్నారు పిటిషనర్ తరఫు న్యాయవాది. వార్డుల విభజన ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు పిటిషనర్. దీంతో హైకోర్టును ఆశ్రయించినట్లు చెప్పాడు. మునిసిపాలిటీలపై అభ్యంతరాల సవరణ తర్వాతే నోటిఫికేషన్ ఇవ్వాలని హై కోర్టు ఆదేశాలు ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు. మునిసిపల్ ఎన్నికలకు అడ్డంకులు తొలగిపోవడంతో ప్రభుత్వానికి లైన్ క్లియర్ అయ్యింది. హై కోర్టు ఆదేశాలతో డిసెంబర్ నెలలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది.