English | Telugu

గంటా, కొండ్రు దారెటు? టీడీపీ హైకమాండ్ ఆరా..! 

పలువురు టీడీపీ ఎమ్మెల్యేలే కాదు... ముఖ్యనేతలు కూడా పక్కచూపులు చూస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన పలువురు టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్ధులు... వైసీపీ గూటికి చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలా పక్క చూపులు చూస్తున్నవాళ్లలో ఎక్కువగా ఆయా పార్టీల నుంచి ఎన్నికల ముందు టీడీపీలో చేరినవాళ్లే ఉన్నారనే మాట వినిపిస్తోంది. ముఖ్యంగా మూడు రాజధానుల ప్రచారం తర్వాత ఇలాంటి వాళ్లంతా బయటపడుతున్నారు. మూడు రాజధానుల ప్రతిపాదనను తెలుగుదేశం తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే... ఒకరిద్దరు టీడీపీ నేతలు మాత్రం దాన్ని సమర్ధిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర నుంచి ఆ వాయిస్ వినిపిస్తోంది. అసెంబ్లీ వేదికగా సీఎం జగన్ ఆ వ్యాఖ్యలు చేశారో లేదో... వెంటనే టీడీపీ ఎమ్మెల్యే గంటా సమర్ధించారు. విశాఖలో పరిపాలనా రాజధానిని ఆహ్వానిస్తూ ట్వీట్స్ చేశారు. అలాగే, రాజాం నుంచి టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయిన కొండ్రు మురళి కూడా జగన్ వ్యాఖ్యలను సమర్ధిస్తూ ప్రకటన చేశారు. దాంతో, వీళ్లిద్దరూ వైసీపీలో చేరడం ఖాయమనే మాట వినిపించింది. జగన్ చెంతకు వెళ్లాలనే ఆలోచనతోనే మూడు రాజధానుల ప్రకటనను స్వాగతించారనే ప్రచారం జరిగింది. అయితే, ఉత్తరాంధ్ర వాసిగా మాత్రమే తాను విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్ ను ఆహ్వానించానని గంటా వివరణ ఇచ్చారు. ఇదే విషయాన్ని చంద్రబాబుకి కూడా చెప్పానంటూ తెలియజేశారు. అయితే, కొండ్రు మురళి నుంచి మాత్రం ఎలాంటి వివరణ రాలేదు. దాంతో, కొండ్రు వైసీపీ గూటికి చేరడం ఖాయమనే మాట వినిపిస్తోంది.

అయితే, కొండ్రు మురళి తీరుపై తెలుగు తమ్ముళ్లు మండిపడుతున్నారు. ఎన్నికలకు ముందు టీడీపీలో చేరిన కొండ్రు మురళికి చంద్రబాబు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని, పార్టీలో మొదట్నుంచీ ఉంటోన్న ప్రతిభారతిని కాదని, కొండ్రుకి టికెట్ ఇచ్చారని తెలుగు తమ్ముళ్లు గుర్తుచేస్తున్నారు. ఆనాడు కొండ్రు రాకను తాము తీవ్రంగా వ్యతిరేకించామని, కానీ పార్టీ ప్రయోజనాల కోసం ఊరుకున్నామని, కానీ ఇఫ్పుడు కొండ్రు మురళి వ్యవహరిస్తున్న తీరు తేడాగా ఉందని మండిపడుతున్నారు. మూడు రాజధానులకు అనుకూలంగా కొండ్రు మురళి చేసిన వ్యాఖ్యలపై అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు.

అయితే, పార్టీ స్టాండ్ కు విరుద్ధంగా జగన్ వ్యాఖ్యలను సమర్ధించిన కొండ్రు మురళిపై అధిష్టానం సీరియస్ గానే దృష్టిపెట్టిందట. అసలు కొండ్రు ఉద్దేశమేంటో తెలుసుకునేందుకు ఆరా తీస్తున్నారట. మొత్తం సిక్కోలు టీడీపీలో కొండ్రు మురళి వ్యవహారంపై జోరుగా చర్చ జరుగుతోంది. పార్టీ మారాలనే ఆలోచనతో జగన్ వ్యాఖ్యల్ని సమర్ధించారా? లేక... ఉత్తరాంధ్రపై అభిమానంతో మాట్లాడారో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.