English | Telugu
సీఐడీ నిర్మూలం కాబోతోందా..?
Updated : Jan 30, 2020
తెలంగాణలో సీఐడీ డిపార్ట్ మెంట్ మూలన పడింది. వందల కొద్దీ కేసులు సీఐడీ దగ్గర పెండింగ్ లో ఉండిపోయాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదొందల కేసులు దర్యాప్తు కొలిక్కి రాలేదు. సంచలన స్కాం ల దగ్గర నుండి సాధారణ కేసుల దాకా సీఐడీ పోలీసులు చేధించలేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఒకప్పుడు సీఐడీ పోలీసులు అంటే హడల్, ఒక కేసు వారి చేతిలో పడిందంటే దర్యాప్తు త్వరగా ముగుస్తుంది. ప్రజలు కూడా ఎంతో నమ్మకంతో ఉండేవారు, చిన్న కేసుల నుంచి సెన్సేషనల్ స్కాముల వరకు సీఐడీ పోలీసులు తమదైన స్టైల్ లో దర్యాప్తు చేసి నిందితులని కటకటాల వెనక్కి నెట్టేవారు కాని, కొన్ని రోజులుగా సిఐడి మూలన పడినట్లు కనిపిస్తోంది.
అనేక కేసులు సీఐడీ పోలీసుల దగ్గరే పెండింగ్ లో ఉన్నాయి. సంవత్సరాలు గడుస్తున్నా దర్యాప్తు కొలిక్కి రావడం లేదు. ఈ సంచలన విషయాలన్నీ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ బయటపెట్టింది. తెలంగాణ ఏర్పడిన తరువాత సీఐడీ పనితీరు మందగించింది. తెలంగాణ ప్రభుత్వం అప్పచెప్పిన తొలి కేసునే ఇప్పటి వరకూ తేల్చలేకపోయింది సిఐడి. ఉమ్మడి ఏపీలో జరిగిన ఇందిరమ్మ ఇళ్ల స్కామ్ లు ఓ కొలిక్కి కూడా తీసుకురాలేకపోయారు. దాదాపు ఆరేళ్ళు గడుస్తున్నా ఈ కేసులో నిందితులు ఎవరో తేలలేదు. తెలంగాణలో మొత్తం 3600 గ్రామాల్లో 23000 పైగా ఇళ్లను అప్పటి ప్రభుత్వం శాంక్షన్ చేసింది. అందులో వెయ్యికి పైగా ఇండ్లు కట్టనప్పటికీ కట్టినట్టు వాటికి సంబంధించిన నిధులని మళ్ళించారంటూ పలువురిపై కేసులు నమోదయ్యాయి.
2014 లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం సీఐడీకి అప్పగించిన తొలి కేసిది ఇప్పటి వరకు కొలిక్కి రాలేదు. అదేకాదు ఎంసెట్ స్కాం, సీఎంఆర్ఎఫ్ స్కామ్, బోధన్ స్కాం వంటి అత్యంత సంచలన కేసులని సీఐడీ నాంచుతూనే ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఐడీ దగ్గర 242 కేసులు ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య 510కి చేరింది. గతంలో వందకు పైగా కేసులని సీఐడీ డిస్పోజ్ చేసినప్పటికీ ఇంకా దర్యాప్తు చేయాల్సిన కేసుల సంఖ్య మాత్రం తగ్గడం లేదు. ఇవే ఆరోపణలతో ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కొన్ని నెలల క్రితం సీఎస్ కు లేఖ రాసింది. సీఐడీ వింగ్ లో మొత్తం 820 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో ఎడిషనల్ డిజిపి స్థాయి నుంచి ఐజీ, డీఐజీ, ఎస్పీ, బీఎస్పీ తదితర సిబ్బంది ఉన్నారు.
2014 లో సీఐడీకి కోటి రూపాయల నిధులు ఉంటే, 2017 కు నిధులు మూడు కోట్లను దాటాయ్ కానీ, కేసులు మాత్రం అలాగే పెండింగ్ లో ఉండిపోయాయి. ప్రభుత్వం ఏదైనా కేసును సీఐడీకి అప్పగిస్తే నిర్ణీత సమయంలోనే దర్యాప్తు పూర్తి చేసి న్యాయం జరిగేలా చూస్తుందని ప్రజలకు నమ్మకం కానీ, కొన్నేళ్లుగా కేసులు చేధించకుండా తమ దగ్గరే నాంచుతూ పెట్టుకోవటం పట్ల సీఐడీ విశ్వాసం కోల్పోతుంది. సీఐడీ వ్యవస్థను సియస్ ప్రక్షాళన చేయాలని ప్రజలు కోరుతున్నారు.