English | Telugu
దేశంలో ఎకనామిక్ ఎమర్జెన్సీ..! గత పదేళ్లలోనే అత్యంత కష్టకాలం?
Updated : Jan 30, 2020
ఐదు శాతం వృద్ధితో జీడీపీ పదకొండేళ్ల కనిష్టానికి చేరింది... కేవలం ఒకే ఒక్క శాతం వృద్ధితో పెట్టుబడుల రంగం 17ఏళ్లనాటి స్థాయికి పడిపోయి అత్యంత నత్తనడకన సాగుతోంది. అలాగే, తయారీ రంగం వృద్ధి 15ఏళ్ల కనిష్టానికి పడిపోగా... కేవలం రెండు శాతం వృద్ధి మాత్రమే నమోదు చేసింది. ఇక, వ్యవసాయంలో కూడా వృద్ధిరేటు నాలుగేళ్ల అత్యల్పానికి పతనమై 2.8శాతం వృద్ధి రేటుతో మొత్తం దేశ ఆర్ధిక పరిస్థితినే భయపెడుతున్నాయి. ఇలా అన్ని రంగాల్లో వృద్ధి రేటు పడిపోవడంతో ఈసారి బడ్జెట్లో అన్ని వర్గాలను సంతృప్తిపర్చడం కత్తిమీదసామే అంటున్నారు విశ్లేషకులు. ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ ముందు అనేక సవాళ్లు ఉన్నాయని, ముఖ్యంగా దేశంలో అన్ని వర్గాలను సంతృప్తిపర్చేలా బడ్జెట్‌ను ఈసారి అంత ఈజీ కానే కాదని చెబుతున్నారు.
ఎందుకంటే, గత పదేళ్లలో ఎన్నడూలేనంతగా దేశంలో అత్యంత క్లిష్టమైన పరిస్థితులు ఉన్నాయని అంటున్నారు. ఒకవైపు వేగంగా పెరుగుతోన్న ద్రవ్యోల్బణం దేశాన్ని భయపెడుతుంటే.... మరోవైపు దేశ ఆర్ధిక పరిస్థితి... ప్రపంచ రాజకీయాలు... ఇలా అన్నీ ప్రస్తుతం భారత్‌కు ప్రతికూలంగా ఉన్నాయని విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా దేశ ప్రగతిని ముందుకు నడిపించే జీడీపీ వృద్ధిరేటు పతనం కావడం... నిరుద్యోగ రేటు 40ఏళ్ల గరిష్టానికి చేరడం... ఆటోమొబైల్ పరిశ్రమ కుదేలవడం వంటి సమస్యలు.... ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్‌కు సవాళ్లు విసురుతున్నాయని అంటున్నారు. వృద్ధి అంచనాలు కూడా 42ఏళ్లలో అతిస్వల్పంగా నమోదుకావడం కూడా ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయని... దాంతో, గత పదేళ్లలోనే అత్యంత కష్టమైన బడ్జెట్‌గా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇక, కొనుగోళ్లు లేక జీఎస్టీ వసూళ్లు, ఆదాయపు పన్ను వసూళ్లు తగ్గడం వంటి అంశాలు కేంద్రాన్ని కలవరపెడుతున్నాయి. అలాగే, గత బడ్జెట్లో కేంద్రం నిర్దేశించుకున్న ద్రవ్యలోటు అంచనాలు తప్పాయి. దాంతో, ఆ లోటు మరింత పెరగకుండా ఇఫ్పుడు బడ్జెట్ ను ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. అయితే, ఆర్ధిక కష్టకాలంలో వనరులను సమీకరించుకోవడం సవాలుతో కూడుకున్న పని కావడంతో అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అంటున్నారు. మొత్తానికి ఈసారి ప్రవేశపెట్టబోయే బడ్జెట్ మాత్రం చాలా టఫ్ అంటున్నారు. మరి, ఈ పెను సవాలును నిర్మలమ్మ ఎలా అధిగమిస్తారో చూడాలి.