English | Telugu

తెలంగాణలో క‌రీంన‌గ‌ర్ ఫార్ములా!

క‌రీంన‌గ‌ర్‌లో ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను ధీటుగా ఎదుర్కొన్ని టిఆర్ ఎస్ పార్టీని చిత్తు చేసిన బండి సంజ‌య్ అవే ఎత్తుగ‌డ‌ల‌తో తెలంగాణా రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తెస్తార‌ట‌. తెలంగాణా బిజెపి అధ్య‌క్షుడిగా ఎం.పీ బండి సంజయ్ నియామ‌కం ఆ పార్టీ కార్య‌క‌ర్త‌ల్లో కొత్త ఆశ‌లు రేపింది. చతికిలపడిపోయిన పార్టీకి నూత‌న ఉత్తేజం క‌ల్పించి పార్టీ శ్రేణులలో ఆత్మస్థైర్యం పెంచుతార‌నే ఆకాంక్ష వ్య‌క్తమ‌వుతోంది. యువ‌కుడైన బండి యువ‌త‌కు ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని జెండా మోస్తున్న బిజెపి కార్య‌క‌ర్త‌లు కోరుకుంటున్నారు.

బిజెపి అధిష్టానం కూడా యువకులకు అవకాశం ఇస్తోందన్న సంకేతాలిచ్చింది. ప్రజాసమస్యల పరిష్కారంపై పోరాటం, సర్కారుపై విమర్శలలో దూకుడుగా వెళ్లే సంజయ్‌కు, పార్టీ పగ్గాలు ఇవ్వడం ద్వారా, దశాబ్దాల తరబడి జిల్లా పార్టీ శ్రేణులలో గూడుకట్టుకున్న నిరాశను, నాయకత్వం తొలగించింది. సమర్ధులు, యువతకు అవకాశాలు ఉంటాయన్న సంకేతం ఇచ్చింది. బండి నాయ‌క‌త్వంలో ఇక బిజెపి యూత్‌కు ప్ర‌ధాన్య‌త పెర‌గ‌నుంది.

రాష్ట్ర బీజేపీలో నిర్ణయాలన్నీ కేవ‌లం ఆ నలుగురైదుగురికే పరిమితం. ఈ నేప‌థ్యంలో సంజయ్ ఎలా వ్య‌వ‌హ‌రిస్తార‌న్న‌ది ఆస‌క్తికరంగా మారింది. సీనియర్ల స్ధానంలో యువతను ప్రోత్సహించడం, సీనియర్లతో సమన్వయం వంటి అంశాల్లో బండి సంజ‌య్ నిర్ణ‌యాలే తెలంగాణాలో బిజెపి భ‌విష్య‌త్‌ను నిర్ణ‌యించ‌నున్నాయి.

యువ‌త‌కు ప్రాధాన్య‌త ఇవ్వ‌డం, సీనియ‌ర్ల‌తో స‌మ‌న్వ‌యం చేసుకోవ‌డం, కొత్త వారిని పార్టీలో చేర్చుకోవ‌డం అనే ల‌క్ష్యాల‌తో బండి సంజ‌య్ ప‌నిచేయ‌బోతున్నార‌ట‌. అయితే పార్టీ అధ్య‌క్షుడిగా ఎన్నికైన బండికి మొద‌టి ప‌రీక్ష గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు. గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో బండి మార్క చూపించ‌డానికి పాతనగరంలో పార్టీని విస్తరించే దిశ‌గా కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక రూపొందింస్తున్నార‌ట‌.

పార్టీతో విబేధించి దూరమైన సీనియర్లకు, పార్టీలోనే ఉన్నా, అప్పటి చురుకుదనంతో పనిచేయడం మానేశారు. వారికి పార్టీలో స్థానం, గుర్తింపు లేదు. వారి సేవలను వాడుకోవడంలేదు. జిల్లాల వారీగా, అలాంటి వారిని గుర్తించి పార్టీని బ‌లోపేతం చేసే దిశ‌గా చ‌ర్య‌లు తీసుకుంటారా?

కొత్త‌గా పార్టీలో చేరిన వారికి బిజెపిలో అంత‌గా ప్రాధాన్యం, గుర్తింపు వుండ‌వు. అలాంటి వారి ప‌ట్ల బండి ఎలా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు?

తెలంగాణాలో పార్టీని బ‌లోపేతం చేయ‌డానికి బండి సంజ‌య్ క‌రీంన‌గ‌ర్ ఫార్మ‌లాని అప్లాయిచేస్తార‌ట‌!