English | Telugu

కేసీఆర్ సర్కారుకు హైకోర్టు చీవాట్లు... గుక్కతిప్పుకోనివ్వకుండా వరుస పంచ్‌లు

కేసీఆర్ ప్రభుత్వానికి హైకోర్టు చీవాట్లు పెట్టింది. గుక్కతిప్పుకోనివ్వకుండా మాటల తూటాలు పేల్చింది. వరుస పంచ్ డైలాగులతో ప్రభుత్వాన్ని దాదాపు షేక్ చేసింది. సమ్మె విరమించమని కార్మికులను ఆదేశించలేమన్న హైకోర్టు.... బ్యూరోక్రాట్లు అతితెలివి ప్రదర్శిస్తున్నారని అసహనం వ్యక్తంచేసింది. సమస్యను తేల్చే ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్న విషయం స్పష్టంగా కనిపిస్తోందంటూ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కార్మికుల డిమాండ్లలో కనీసం నాలుగింటిని పరిష్కరించి 47కోట్లు ఇస్తారా లేదా అంటూ సూటిగా ప్రశ్నించింది. అయితే, 47 కోట్లు వెంటనే ఇవ్వలేమని, గడువిస్తే ప్రయత్నిస్తామన్న ప్రభుత్వ సమాధానంతో... హూజుర్ నగర్ కి వంద కోట్ల వరాలు ప్రకటించడంపై సెటైర్లు వేసింది. కేవలం ఒక్క నియోజకవర్గ ప్రజలే ముఖ్యమా? అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అధికారులు వాస్తవాలను మరుగున పెడుతున్నారని, నిజాలను తెలివిగా దాస్తున్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది.

ఆర్టీసీ కార్మికుల సమ్మె, బకాయిలు చెల్లింపుపై ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ పై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. రాష్ట్ర విభజన జరిగి ఆరేళ్లవుతున్నా, ఇప్పటికీ ఆర్టీసీ ఆస్తులు, అప్పుల పంపకాలు ఎందుకు పూర్తి కాలేదని హైకోర్టు ప్రశ్నించింది. అయితే ఆర్టీసీ తొమ్మితో షెడ్యూల్ లో ఉండటం కారణంగా సాధ్యంకాలేదని ప్రభుత్వం రిప్లై ఇచ్చింది. ఇక, తెలంగాణలో మొత్తం ఎన్ని ఆర్టీసీ బస్సులు ఉన్నాయో.... ప్రస్తుతం ఎన్ని బస్సులు తిరుగుతున్నాయో చెప్పాలని హైకోర్టు ఆదేశించింది. అయితే, 75శాతం బస్సులు తిరుగుతున్నాయంటూ ప్రభుత్వం సమాధానం చెప్పడంతో... అలాగైతే ప్రజలు ఎందుకు ఇబ్బందులు పడుతున్నారంటూ ప్రశ్నించింది. ఇప్పటికీ మూడో వంతు బస్సులు తిరగడం లేదని, అందుకే ప్రయాణికులు ఇక్కట్లు పడుతున్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది.

ఆర్టీసీకి ఎంత ఇచ్చారో చెప్పమనలేదన్న హైకోర్టు... ఇంకా చెల్లించాల్సిన బకాయిలు ఎంత ఉన్నాయో స్పష్టంగా తెలపాలని ఆదేశించింది. ఇప్పటికే ఆర్టీసీకి 4వేల 253కోట్ల ఇచ్చామని ప్రభుత్వం చెప్పడంతో.... అయితే, మిగతా బకాయిలు చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా అంటూ హైకోర్టు నిలదీసింది. అలాగే, ఆర్టీసీకి కేటాయించిన నిధులను ఎలా కేటగిరైజ్ చేశారన్న హైకోర్టు..... బ్యాంక్ గ్యారంటీకి ఇచ్చిన నిధులకు డీఫాల్టర్ ప్రభుత్వం కాదా అంటూ ప్రశ్నించింది. జీహెచ్ఎంసీ నుంచి ఆర్టీసీకి రావాల్సిన బకాయిలు 335 కోట్లు చెల్లించారా లేదా అని హైకోర్టు ప్రశ్నించింది. దానికి ప్రభుత్వం నుంచి సరైన సమాధానం రాకపోవడంతో పూర్తి వివరాలతో శుక్రవారం మరోసారి రావాలని ఆదేశించింది. ఇప్పటికే 15మది ఆర్టీసీ కార్మికులు మరణించారని, సమ్మె వల్ల ప్రజలు మాత్రమే కాకుండా 50వేల మంది కార్మికుల కుటుంబాలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గుర్తుంచుకోవాలని ఇరువర్గాలకు సూచించింది.