English | Telugu

రాజ్యసభ ఎన్నికల వేళ టీడీపీకి షాక్ ఇచ్చిన ఎమ్మెల్యే!!

ఏపీలో నాలుగు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ పోరులో వైసీపీ నుండి నలుగురు, టీడీపీ నుండి ఒకరు బరిలో ఉన్నారు. అయితే, ఓడిపోతారని తెలిసి కూడా టీడీపీ ఎన్నికల బరిలోకి దిగి, కుల రాజకీయాలు చేస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది. ఇదిలా ఉంటే, అసలు అసెంబ్లీలో టీడీపీ బలమే 23 అంటే.. దానికి తోడు కరణం బలరాం, వల్లభనేని వంశీ, మద్దాలి గిరి వంటి ఎమ్మెల్యేలు టీడీపీకి దూరం జరిగారు. ఇది చాలదు అన్నట్టు ఈరోజు ఇద్దరు ఎమ్మెల్యేలు పోలింగ్ కి దూరమయ్యారు. ఈఎస్ఐ స్కాం ఆరోపణలతో అరెస్టై ప్రస్తుతం అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అచ్చెన్నాయుడు ఓటింగ్ కి రాలేకపోయారు. అలాగే, ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ కూడా ఓటు వేయలేదు.

కరోనా నేపథ్యంలో సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉన్న తాను రాజ్యసభ ఎన్నికల ఓటింగ్ లో పాల్గొన్నలేకపోతున్నాను అంటూ అనగాని సత్యప్రసాద్ టీడీపీ అధినేత చంద్రబాబుకు లేఖ ద్వారా తేలియజేశారు. ఇటీవల వ్యాపార రీత్యా తెలంగాణ జనగాం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదిరెడ్డిని కలిశానని తెలిపారు. ఆయనకు కరోనా పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో తాను కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సెల్ఫ్ క్వారంటైన్ లో‌ ఉంటున్నానని.. వైద్యుల సలహా మేరకు ఓటింగ్‌కు హాజరు కాలేకపోతున్నానని లేఖలో పేర్కొన్నారు. కాగా, అనగాని సత్యప్రసాద్ పార్టీ మారుతున్నారంటూ ఇటీవల ప్రచారం జరిగింది. దీంతో, ఆయన నిజంగా కరోనా కారణంగానే ఓటింగ్ కి దూరంగా ఉన్నారా? లేక మరేదైనా కారణముందా? అన్న చర్చలు మొదలయ్యాయి.