English | Telugu
హత్యకు ముందు సురేష్.. ఎమ్మార్వో భర్తతో ఏం మాట్లాడాడు? కారులో వచ్చింది ఎవరు?
Updated : Nov 7, 2019
అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డి తన ఆఫీస్ లోనే అగ్నికి ఆహుతి అయిన సంగతి తెలిసిందే. అయితే ఆమెను హత్య చేసిన నిందితుడు సురేష్ కూడా ఈరోజు మృతి చెందాడు. తహసీల్దార్ విజయారెడ్డి పై పెట్రోల్ పోసి తగులబెట్టిన ఘటనలో అతడు కూడా తీవ్ర గాయాలపాలయ్యాడు. సురేష్ 65 శాతం కాలిన గాయాలతో ఉస్మానియా ఆస్పత్రిలో చేరగా చికిత్స అందించారు. అయితే పరిస్థితి విషమించి అతడు మృతి చెందాడు. ముఖం, ఛాతీ కాలిపోవటంతో అతడు చికిత్సకు స్పందించలేదని సమాచారం.
కాగా, ఓ భూమికి సంబంధించి పట్టా ఇవ్వలేదనే ఆగ్రహంతోనే తాను ఎమ్మార్వోను సజీవ దహనం చేసినట్లు సురేష్ వాంగ్మూలం ఇచ్చాడు. అయితే తహసీల్దార్ విజయారెడ్డి హత్య వెనుక రాజకీయ శక్తులు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారంలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే పాత్ర ఉందని.. ఇద్దరు స్థానికులు ఫోన్ మాట్లాడుకున్న ఆడియో లీక్ అయింది. మరోవైపు విజయారెడ్డి భర్త కూడా ఈ హత్య వెనుక రాజకీయ నాయకులు ఉన్నారని, సురేష్ వెనుక ఎవ్వరో ఉన్నారని.. సీబీఐ దర్యాప్తు చేసి నిజానిజాలు తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు అధికార పార్టీ నేతలు, విపక్ష నేతలు.. తహసీల్దార్ మృతికి మీరు కారణం అంటే మీరు కారణం అంటూ విమర్శలు చేసుకుంటున్నారు.
విజయారెడ్డి హత్య రాజకీయ రంగు పులుముకోవడంతో.. పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. విజయారెడ్డిపై దాడికి ముందు ఆమె ఇంటి వద్ద సురేష్ రెక్కి నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. ఘటనకు రెండు రోజుల ముందు విజయారెడ్డి ఇంటి దగ్గర ఆమె భర్తతో కూడా సురేష్ మాట్లాడినట్లుగా పోలీసులు ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. అంతేకాదు, విజయారెడ్డి హత్య తర్వాత తహసీల్దార్ కార్యాలయం నుంచి బయటికొచ్చిన సురేష్.. కారులో ఉన్నవారితో మాట్లాడినట్లు గుర్తించారు. సురేష్‌తో కారులో కూర్చోని మాట్లాండింది ఎవరో తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కారులో ఉన్నవారు ఎవరో తెలిస్తే.. ఈ హత్య వెనుక రాజకీయ శక్తులు ఉన్నాయో లేదో తెలిసే అవకాశం ఉంది.