English | Telugu

కేంద్ర ప్రభుత్వ భవనాలకు కాషాయ రంగు వేస్తే ఊరుకుంటారా?

* పంచాయతీ భవనాలకు వై సి పీ రంగులు వేయడం పై సుప్రీమ్ ఆగ్రహం
* హై కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏ.పి . ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్ కొట్టివేత

సుప్రీమ్ కోర్టులో ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వానికి చుక్కెదురైంది. పంచాయతీ భవనాలకు వైసీపీ జెండా రంగులు వేయడంపై సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్ పై ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఘాటైన వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో ఏ.పి . ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. పిటిషన్‍ను విచారించిన ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం. కేంద్ర ప్రభుత్వ భవనాలకు కాషాయ రంగు వేస్తే ఒప్పుకుంటారా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది . హైకోర్టు ఆదేశాలను సమర్థిస్తూ పిటిషన్‍ను కొట్టివేసిన సుప్రీంకోర్టు.
స్థానిక సంస్థల ఎన్నికల వేళ జగన్ సర్కారుకు ఏపీ హైకోర్టు ఈ నెల 10 వ తేదీన షాక్ ఇచ్చిన విషయం పాఠకులకు తెలిసిందే. గవర్నమెంట్ ఆఫీసులకు వైసీపీ రంగులు వేయడంపై కీలక తీర్పు వెలువరించింది. వెంటనే పంచాయతీ భవనాలకు రాజకీయ పార్టీల రంగులు తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. నేటి నుంచి పది రోజుల్లోగా మళ్లీ రంగులు వేయాలని స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాలు అమలు చేసినట్లు ఆధారాలతో సహా నివేదిక రూపంలో సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. గుంటూరు జిల్లా పల్లపాడుకు చెందిన ముప్పా వెంకటేశ్వరరావు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు.. వైసీపీ జెండా రంగు తరహా రంగులు వేయాలని పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్‌ జారీ చేసిన మెమోను రద్దు చేసింది. హై కోర్టు తీర్పుపై సుప్రీం కోర్టును ఆశ్రయించిన ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వానికి అక్కడ కూడా చుక్కెదురైంది.