English | Telugu
రెండేళ్ల తరువాత అరసవల్లి సూర్య నారాయణ స్వామి ఆలయంలో మహా అద్భుతం...
Updated : Oct 3, 2019
రెండేళ్ల నిరీక్షణకు ఫలితం కనిపించింది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అరసవల్లి సూర్య నారాయణ స్వామిని సూర్య కిరణాలు ముద్దాడాయి. ఈ అద్భుత ఘట్టం కోసం రెండేళ్లుగా భక్తులు ఎదురు చూస్తున్నారు. గత రెండేళ్లుగా స్వామి వారిని సూర్య కిరణాల తాకిడి ఆనవాళ్లు కనిపించక నిరాశ చెందిన భక్తులకు ఇవాల్టి ఘటన మనసును ఉత్తేజపరిచింది. సూర్యుడు ఉత్తరాయణం నుంచి దక్షిణాయనానికి దక్షిణాయనం నుంచీ ఉత్తరాయణానికి మారే సమయంలో ఇలాంటి ఘటన ఆవిష్కృతమవుతుంది. ఇలాంటిది ఏడాదిలో రెండు నెలల్లో రెండు సార్లు మాత్రమే జరుగుతుంది. ఉదయించే లేలేత సూర్య కిరణాలు స్వర్ణ కాంతులతో ఆలయంలోని గర్భగుడిలో కొలువుదీరిన స్వామి వారి మూల విరాట్ పాదాల నుంచి శిరస్సు వరకు కిరణాల తాకుతాయి. అయితే వాతావరణం అనుకూలించక మొదటి రోజున కారుమబ్బులు సూర్య కిరణాల తాకిడికి ఆటంకం కలిగినా రెండో రోజు మాత్రం ఏకంగా ఏడు నిమిషాల పాటు సూర్య కిరణాలు స్వామి వారి మూల విరాట్ ను తాకాయి. ఉదయం ఆరు గంటల ఒక నిమిషం నుంచి ఆరు గంటల ఎనిమిది నిమిషాల వరకు సూర్య కిరణాలను చూసిన భక్తులు పరవశించిపోయారు.
ఎప్పుడో ఓసారి జరిగే ఈ మహాద్భుతాన్ని చూసేందుకు వచ్చిన భక్తులు మొదటి రోజును నిరాశతో వెళ్ళిపోయినా, రెండో రోజు మాత్రం ఈ సూర్య కిరణాలను కనులారా చూసి పరవశించిపోయారు. శ్రీకాకుళం జిల్లాలో కొలువుదీరిన శ్రీ అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారి ఆలయాన్ని దర్శించుకున్న భక్తులకు ఈ అదృష్టం దక్కింది. ప్రతి ఏటా మార్చి ఎనిమిది, తొమ్మిది తేదీల్లో సూర్యుడు ఉత్తరాయణం నుంచి దక్షిణాయనానికి, అక్టోబర్ ఒకటి, రెండు తేదీల్లో దక్షిణాయనం నుంచీ ఉత్తరాయణానికి మారుతుంటాడు. ఈ సమయంలో సూర్య కిరణాలు స్వామి వారి మూలవిరాట్ ను తాకుతాయి.