English | Telugu
జగన్ సర్కార్ ఎఫెక్ట్.. కర్ణాటకలో బంద్.. ఏపీ బస్సుపై రాళ్లు
Updated : Feb 13, 2020
ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో 75శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చేలా ఓ రూల్ తీసుకురావాలని ఏపీలోని జగన్ సర్కార్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ఇది అనాలోచిత నిర్ణయమని విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఏపీని చూసి మిగతా రాష్ట్రాలు కూడా ఇదే రూల్ పెడితే.. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో ఉద్యోగాలు చేస్తున్న.. ఆంధ్రుల పరిస్థితి ఏంటని విపక్షాలు ప్రశ్నించాయి. విపక్షాల అనుమానాలే నిజమయ్యాయి. మిగతా రాష్ట్రాల్లో కూడా 75శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలంటూ డిమాండ్స్ పెరుగుతున్నాయి. ముఖ్యంగా జగన్ సర్కార్ ఎఫెక్ట్ కర్ణాటక పై పడింది. 75శాతం ఉద్యోగాలు స్థానిక యువతకే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కర్ణాటక రక్షణ వేదిక నేడు బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ బంద్‌కు పలు సంఘాలు సైతం మద్దతు ప్రకటించాయి.
స్థానికులకే 75శాతం ఉద్యోగాలు కల్పించాలని దాదాపుగా గత 100 రోజుల నుంచి అక్కడ నిరసనలు జరుగుతున్నాయి. అయితే ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పష్టమైన హామీ రాకపోవడంతో కర్ణాటక రక్షణ వేదిక బంద్ కి పిలుపునిచ్చింది. అయితే ఏపీ బస్సులను టార్గెట్ చేసి రాళ్ల దాడి చేయడం బంద్‌ను ఉద్రిక్తంగా మార్చింది. మంగళూరులో ఫరంగిపేట వద్ద ఓ బస్సుపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. తిరుపతి నుంచి మంగుళూరు వెళ్తున్న బస్సును ధ్వంసం చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ రాళ్ల దాడిలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో బస్సులోని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. మంగళూరుతో పాటూ బెంగళూరు మరికొన్ని ప్రాంతాల్లో బంద్ కొనసాగుతోంది. మొత్తానికి జగన్ సర్కార్ ఎఫెక్ట్ కర్ణాటకపై గట్టిగానే పడింది.