English | Telugu

పితానిని కావాలనే టార్గెట్ చేశారా? టీడీపీ నేతల మౌనం ఎందుకు?

పశ్చిమగోదావరి జిల్లాలో పార్టీ ఏదైనా ఆచంట నియోజకవర్గం మాత్రం పితానికి కంచుకోట. గత ఎన్నికలకు ముందువరకూ ఆయన మాటకు ఎదురు నిలిచిన పార్టీ, నాయకుడు లేడు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం మొదలు, కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు ఇలా ముఖ్యమంత్రులు, పార్టీలు అధికారం మారారే తప్ప పితాని సత్యనారాయణకు మంత్రి పదవి మాత్రం మారలేదు. అయితే, వరుసగా మూడుసార్లు మంత్రిని చేసిన అదృష్టం కాస్తా ఇప్పుడు యూ టర్న్ తీసుకున్నట్టుంది. ఓ వెలుగు వెలిగిన పితానిపై తాజాగా ఈఎస్‌ఐ స్కామ్ ఆరోపణలు దుమారం రేపుతున్నాయి.

వాస్తవానికి పితాని... టీడీపీలో చేరకముందు వైఎస్ రాజశేఖరరెడ్డికి, ఆయన కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. జగన్... వైసీపీని ఏర్పాటుచేశాక వైఎస్‌కు దగ్గరగా ఉన్నవారంతా ఆ పార్టీలో చేరతారని భావించారు. కానీ జిల్లాకు చెందిన మాజీ మంత్రులు పితాని, వట్టి అటు వైపు చూడలేదు. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీకి అవకాశం కల్పిస్తామని భరోసా ఇచ్చినా, ఆయన మొగ్గలేదనేది టాక్. ఎన్నికలు ముగిశాయి. అధికారం తారుమారైయ్యింది. నేతలు ఎవరి రాజకీయం వారు చేస్తూనే ఉన్నారు. పార్టీల మధ్య విభేదాలు తారాస్దాయికి చేరడంతో, ఆయా పార్టీల నేతలు ఢీ అంటే ఢీ అనే స్దాయికి చేరుకున్నారు.

విచారణలో నిజానిజాలు ఎలానూ తేలుతాయి. స్కామ్ లో పితాని భాగస్వామ్యం ఎంతవరకూ అనేది త్వరలో వెలుగుచూస్తుంది. అయితే ఈలోపు తమ పార్టీ నేతకు అండగా నిలవాల్సిన జిల్లా టిడిపి మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు మనకెందులే అని లైట్ తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. అదే పితాని వర్గం ఆవేదన కూడా. మద్దతివ్వాల్సిన సొంత పార్టీ నేతలు మౌనం దాల్చడంతో పితాని ఒంటరి పోరాటం చేస్తున్నారని ఆయన అనుచరులు అంటున్నారు. ఏదైమైనా పితాని తనపై వచ్చిన అవినీతి ఆరోపణలో ఒంటరి పోరాటం చేస్తున్నారని, ఆయన అనుచరులంటున్నారు. అండగా నిలుస్తుందని ఆశించిన పార్టీ, అంతకంతకూ దూరం పెడుతోందని, పితాని వర్గీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.