English | Telugu

ఇత‌ర‌ వైరస్‌లతో పోల్చితే కరోనా వైరస్‌ మరణాల రేటు తక్కువే!

క‌రోనా నియంత్రణకు ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలంగాణా మంత్రులు భ‌రోసా ఇస్తున్నారు. క‌రోనా వస్తే చనిపోతారన్న ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం లేదని, గత వైరస్‌లతో పోల్చితే కరోనా వైరస్‌లో మరణాల రేటు తక్కువని వారు చెబుతున్నారు.

కరోనా వైరస్‌ నియంత్రణ, తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర ప్ర‌భుత్వం అత్య‌వ‌స‌ర‌ సమన్వయ సమావేశం నిర్వహించింది. మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో వైద్య, ఆరోగ్య, పురపాలక, పంచాయితీరాజ్‌శాఖల అధికారులు, మంత్రులు ఈ స‌మావేశంలో పాల్గొన్నారు.

ఆయా శాఖ కార్యదర్శులు, శాఖాధిపతులతో మంత్రులు కేటీఆర్‌, ఈటల రాజేందర్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ సమావేశమై వివిధ అంశాలపై సుధీర్ఘంగా చర్చించారు.

జీహెచ్‌ కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌, హైదరాబాద్‌ కలెక్టర్‌ శ్వేతా మహంతి, వివిధ ఆరోగ్య సంస్థల ప్రతినిధులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

వైరస్‌ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలు, అనుమానితులకు పరీక్షలు, ముందు జాగ్రత్త చర్యలు, ప్రజల్లో అవగాహన కల్పించడం సహా పలు అంశాలపై సమావేశంలో చర్చించారు.