English | Telugu
కడప జిల్లా ప్రజల్ని హడలెత్తిస్తున్న సింక్ హోల్స్...
Updated : Sep 25, 2019
కడప జిల్లా అసలే కరువు ప్రాంతం, వర్షాలు కురిస్తే అక్కడ ఒక భయం మాత్రం ముందుగా మొదలవుతుంది. అమాంతంగా ఉన్నట్టుండి భూమి లోపలకి కుంగిపోతూ ఉంటుంది, ఏం జరుగుతుందో అర్థం కాక ఆ గ్రామ ప్రజలందరూ అలాగే చూస్తుంటారు. గ్రామ సమీపంలో ఐదు నుండి యాభై అడుగుల లోతున భూమి కళ్ల ముందే కుంగిపోతుంటాయి. గుంతలు గుంతలుగా పెద్ద పెద్ద హోల్స్ ఏర్పడుతూ ఉంటాయి. వీటిని సింక్ హోల్స్ గా చెప్తూ ఉంటారు. గతంలో కూడా ఈ సమస్య వచ్చింది అప్పుడు అసలీ సమస్యకు కారణమేంటో కనుగొనే ప్రయత్నం చేశారు కానీ తెలియలేదు.
కడప జిల్లాలో సింక్ హోల్స్ స్థానిక ప్రజల్ని హడలెత్తిస్తున్నాయి, చింతకొమ్మదిన్నె మండలం బుగ్గమల్లేశ్వర ఆలయం సమీపం లోని గూడవాండ్లపల్లెకు చెందిన రైతు సుబ్బారాయుడు పొలంలో ఇరవై అడుగుల లోతు, అయిదు అడుగుల వెడల్పు తో భూమి లోపలకి కుంగిపోయింది. నెల రోజుల క్రితం ఇప్ప పెంట గ్రామం లోని చెరువులో భూమి కుంగిపోయి అతిపెద్ద గోతులు ఏర్పడ్డాయి. గ్రామానికి కేవలం నూట యాభై మీటర్ల దూరంలో ఉన్న చెరువులో రెండు చోట్ల భూమి కుంగిపోయింది.
సుమారు యాభై అడుగుల మేర కుంగిపోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. భూమి కుంగిపోయే సమయంలో వచ్చిన శబ్దాలు గ్రామస్థుల్ని హడలెత్తించాయి. రాత్రి వేళ కూడా గలగలమనే శబ్దాలు వస్తాయని గ్రామస్థులు తెలిపారు. ఈ సింక్ హోల్స్ కారణంగా తమకు కంటి మీద కునుకు లేకుండా పోయిందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూమి చెరువులో కుంగిపోయింది కానీ, అదే నివాస ప్రాంతాల్లో కుంగితే తమ పరిస్థితి ఏంటని ఆందోళన ప్రస్తుతం స్థానికుల్లో వ్యక్తమవుతోంది.