English | Telugu
కరోనా.. రెండునెలలకు సరిపడా షాపింగ్ ‘కరో’నా...
Updated : Mar 15, 2020
ఇదీ..కాదు కాదు ఇదే ప్రస్తుత హైదరాబాద్ వాసుల పరిస్థితి. తెలంగాణ ముఖ్యమంత్రి హై లెవల్ కమిటీ సమావేశం తర్వాత మార్చ్ 31 వరకూ మాల్స్, స్కూల్స్ లాంటి జన సమూహ ప్రాంతాలన్నీ మూసి వేయాలని నిర్ణయం ప్రకటించారు. ఈ నిర్ణయం వెలువడిన మరుక్షణం నుంచి హైదరాబాద్ వాసులు నిత్యావసరాల దగ్గర్నుంచి కనీసం ఓ రెండు నెలల వరకూ సరిపడా తమకు కావాల్సిన వస్తువులు కొనుగోలు చేయడం కోసం షాపింగ్ సెంటర్ల ముందు క్యూలు కట్టారు.
నిన్నటి వరకూ మనకు రాదులే..నిశ్చింతగా ఉన్నాం..కానీ వచ్చేసింది. ఇప్పుడేంటి చెయ్యడం? ఒక వైపు మన సంస్కృతీ సంప్రదాయాల ప్రకారం ఇంట్లోనే చిన్న, చిన్న చిట్కాలు పాటిస్తే చాలు కరోనా మనదగ్గరకు వచ్చే సాహసం చెయ్యదు అనే ప్రచారాల హోరు..మరో వైపు దేశంలో రెండో స్థాయికి చేరిన కరోనా అని వార్తల జోరు..మధ్యలో సామాన్యుల బేజారు..చివరికి అందరి బతుకూ బజారు. అచ్చం ఇలానే ఉంది తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణ రాజధాని, విశ్వనగారంగా పేరు తెచ్చుకున్న హైదరాబాద్ లోని ప్రజల పరిస్థితి. వివిధ మీడియాలలో వచ్చే వార్తలను నమ్మాలో..ప్రభుత్వ ప్రకటనలను నమ్మాలో తెలీని ఒక విచిత్ర పరిస్థితుల్లోంచి..అదో రకమైన అయోమయ స్థితిలోకి చేరుకున్నారు. మళ్ళీ ఎన్నటికి సాధారణ స్థితులు నెలకొంటాయో అని, సాధ్యమైనంత త్వరగా సాధారణ పరిస్థితులు రావాలని అందరూ తమ ఇష్ట దైవాలను మనస్ఫూర్తిగా ప్రార్ధిస్తున్నారు.
తెలుగు వన్ ఒకటే చెప్తోంది. ప్రజలెవ్వరూ కంగారు పడకండి..వదంతులు నమ్మొద్దు..మనందరం సరైన నివారణ చర్యలు పాటిద్దాం..కరోనా మహమ్మారిని మన దరికి చేరకుండా చూసుకుందాం. ప్రతిఒక్కరం వ్యక్తిగతంగా, సమాజం పట్ల బాధ్యతగా మెలుగుదాం..కరోనా రక్కసిమీద గెలుద్దాం.