English | Telugu
వెళ్తూవెళ్తూ టీడీపీపై యామిని విమర్శలు... కమలం గూటికి చేరేందుకు సన్నాహాలు
Updated : Nov 7, 2019
తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. ఎన్నికల తర్వాత సైలెంటైపోయిన సాదినేని యామిని టీడీపీకి గుడ్-బై చెప్పేసింది. యామిని టీడీపీకి రాజీనామా చేస్తుందని ఎప్పట్నుంచో ప్రచారం జరుగుతున్నా, ఇప్పుడు తెలుగుదేశం అధికారిక వాట్సప్ గ్రూప్ లో తన రాజీనామా లేఖను పోస్ట్ చేసింది. పార్టీలో అంతర్గత విభేదాలు... దేశం, రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు... ఇతరత్రా బలమైన కారణాల వల్లే టీడీపీకి రాజీనామా చేసినట్లు ప్రకటించింది. అయితే, తన రాజీనామా లేఖలో సాదినేని యామిని కీలక వ్యాఖ్యలు చేసింది. టీడీపీలో నేతల మధ్య సఖ్యత లోపించిందని, అనేక సమస్యలు, లోపాలు ఉన్నాయంది.
టీడీపీకి రాజీనామా చేసిన సాదినేని యామిని... కొంతకాలంగా ఏపీ బీజేపీ చీఫ్ కన్నాతో యామిని చర్చలు జరుపుతున్నారని, త్వరలోనే కాషాయ తీర్ధం పుచ్చుకుంటారని ప్రచారం జరుగుతోంది. అయితే, ఎన్నికలైన నాటి నుంచే ఈ మాటలు వినిపించినా..... అప్పట్లో చంద్రబాబు బుజ్జగించడంతో ఆగిపోయిందని అంటారు. కానీ, ఇప్పుడు బీజేపీలోకి వెళ్లాలని డిసైడైందని, ఒకట్రెండు రోజుల్లో కమలదళంలో చేరబోతున్నారని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, యామినికి ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి ఇస్తామని హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.
అయితే, విమర్శలు, ప్రతివిమర్శలతో అతితక్కువ కాలంలోనే పేరు తెచ్చుకుంది సాదినేని యామిని. టీవీ డిబేట్స్ అయినా, ప్రెస్ మీట్స్ అయినా... టీడీపీ తరపున బలమైన వాయిస్ వినిపించింది. ముఖ్యంగా జగన్, పవన్ పై ఘాటు వ్యాఖ్యలు చేయడంతో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకుంది. యామిని వాగ్దాటిని చూసి, తెలుగుదేశం కూడా నెత్తినపెట్టుకుంది. ఏళ్లతరబడి పని చేస్తున్న నేతలను కాదని, అప్పుడప్పుడే పార్టీలోకి వచ్చిన యామినికి అధికార ప్రతినిధి పదవి కట్టబెట్టింది. ఇక, చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ యామినిని ఎంతో ప్రోత్సహించారు. దాంతో టీవీ డిబేట్స్ అండ్ ప్రెస్ మీట్స్ లో ఆమె కనిపించని రోజే ఉండేది కాదు. అంతలా టీడీపీ వాయిస్ వినిపించింది యామిని.
యామిని... టీడీపీకి రాజీనామా చేయడానికి అనేక కారణాలు వినిపిస్తున్నప్పటికీ... ఏదోవిధంగా అధికార పార్టీలో ఉండాలన్నదే ఆమె లక్ష్యమని అంటున్నారు. అందుకే, అప్పుడు టీడీపీలో చేరిందని... ఇప్పుడు కేంద్రంలో అధకార పగ్గాలున్న బీజేపీలో చేరబోతోందని తెలుగుదేశం నేతలు మాట్లాడుకుంటున్నారు. అంతేకాదు అప్పుడు ఎంతమంది వారించినా వద్దంటున్నా నెత్తిమీద పెట్టుకున్నారని, ఇఫ్పుడవన్నీ పక్కనబెట్టి రాజీనామాచేసి వెళ్లిపోయిందని టీడీపీ మహిళా నేతలు మండిపడుతున్నారు.