English | Telugu

ఆర్నాబ్ సంగతి సరే.. మరి ఆ జర్నలిస్టుల మాటేంటి.. బీజేపీకి శివసేన సూటి ప్రశ్న

ప్రముఖ జర్నలిస్ట్, రిపబ్లిక్ టీవీ ఎడిటర్-ఇన్-చీఫ్ అర్నాబ్ గోస్వామిని నిన్న ముంబై పోలీసులు అరెస్ట్ చేయడం దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ అరెస్ట్ ఘటన పై బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పించారు. స్వయంగా కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, సమాచార ప్రసార శాఖా మంత్రి ప్రకాష్ జవదేకర్ ఈ అరెస్ట్ ను తప్పు పట్టారు. అయితే తాజాగా మహారాష్ట్రలో అధికారంలో ఉన్న శివసేన ఈ వ్యాఖ్యల పై మండిపడింది. ఏకంగా ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకునేలా చేసిన అర్నాబ్ ను అరెస్ట్ చేస్తే బీజేపీ "బ్లాక్ డే, మీడియా స్వేచ్ఛపై దాడి" అంటూ గగ్గోలు పెడుతోందని ఎద్దేవా చేసింది. అర్నాబ్ ను అరెస్ట్ చేస్తే అటు కేంద్ర మంత్రులు, ఇటు రాష్ట్రంలోని బీజేపీ నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారని.. మహారాష్ట్రలో ఏకంగా ఎమర్జెన్సీ నాటి పరిస్థితులు నెలకొన్నాయని అంటున్నారని శివసేన తన అధికార పత్రిక "సామ్నా"లో విమర్శించింది.

మరి బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్ లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసినందుకు ఒక జర్నలిస్టును అరెస్ట్ చేశారని, అదే ఉత్తరప్రదేశ్ లో ఏకంగా జర్నలిస్టులను చంపేశారని ఆ పత్రిక తెలిపింది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరిగిన ఈ సంఘటనలు ఎమర్జెన్సీని గుర్తు చేస్తున్నాయని బీజేపీ నేతలు ఎవరూ ఎందుకు అనలేదని శివసేన ఈ సందర్భంగా ఎద్దేవా చేసింది. అంతేకాకుండా అర్నాబ్ వల్ల ఒక అమాయక వ్యక్తి, అతని తల్లి ఆత్మహత్య చేసుకున్నారని... తమకు న్యాయం చేయాలని ఆ మృతుడి భార్య డిమాండ్ చేస్తోందని సామ్నా ద్వారా శివసేన తెలిపింది. అయినా పోలీసులు వారి పని వారు చేసుకుంటున్నారని కూడా శివసేన స్పష్టం చేసింది.