English | Telugu

సోము వీర్రాజుది వైసీపీ స్క్రిప్టు! వాస్తవాలు చెప్పాలన్న జవహర్  

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారన్న ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటరిచ్చారు మాజీ మంత్రి జవహర్. సోము వీర్రాజు వైసీపీ నేతలు రాసిచ్చిన స్క్రిప్టు చదవుతున్నారని మండిపడ్డారు. సోము వీర్రాజు వైసీపీ నేతలు రాసిచ్చిన స్క్రిప్టు చదవడం మానుకుని.. పోలవరం ప్రాజెక్టుపై వాస్తవాలు మాట్లాడాలని ఆయన హితవు పలికారు. పోలవరం ప్రాజెక్టు పనుల్లో అవినీతి జరగలేదని కేంద్ర జలశక్తి మంత్రి పార్లమెంటు సాక్షిగా చెప్పినా, దానిపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ వీర్రాజుపై మండిపడ్డారు జవహర్. నీతి ఆయోగ్ సిఫారసు మేరకే పోలవరం నిర్మాణ బాధ్యతను రాష్ట్రానికి ఇచ్చారని స్పష్టం చేశారు.

రాజమండ్రిలో ఉదయం మీడియాతో మాట్లాడిన సోము వీర్రాజు ప్రతిపక్ష నేత చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. చంద్రబాబే పోలవరం కాంట్రాక్టరుగా ఉన్నారని గతంలో ఒక కేంద్ర మంత్రే వ్యాఖ్యానించారని చెప్పారు. 48 వేల కోట్ల మేర అంచనాలు ఇష్టారీతిన పెంచేశారు. చంద్రబాబు ఎవరినైనా మేనేజ్ చేయగలరని, లెఫ్ట్ కెనాల్, రైట్ కెనాల్ లో భారీ అవినీతి చోటు చేసుకుందని వీర్రాజు ధ్వజమెత్తారు. ప్రభుత్వ భూములను గత ప్రభుత్వం ప్రైవేటు భూములుగా చూపించిందని, గత ప్రభుత్వం పోలవరం కాంటూరు లెవెల్స్ పెంచేసిందని చెప్పారు. దీంతో దేవీపట్నం మునిగిపోయిందన్నారు సోము వీర్రాజు. పోలవరం డబ్బుతో ఒక టీడీపీ ఎమ్మెల్యే మూడు అపార్ట్‌మెంట్లు కట్టారని, 10 కోట్లతో విజయవాడలో భారీ గెస్ట్ హౌస్ కట్టారని సోము వీర్రాజు ఆరోపించారు.