English | Telugu
వరుస షాక్ లతో బెంబేలెత్తుతున్న టిడిపి!
Updated : Mar 13, 2020
స్థానిక సంస్థల ఎన్నికల వేళ తెలుగు తమ్ముళ్లు సైకిల్ దిగి ఫ్యాన్ కిందకి వెళ్ళడం అధినేత చంద్రబాబుకు నచ్చడం లేదు. రాష్ట్రంలో శరవేగంగా మారుతున్న రాజకీయ పరిణామాల్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. రాజకీయ ఎత్తుగడలతో అధికార వైసీపీ ప్రతిపక్ష పార్టీలోని కీలక నేతలను తమ వైపు తిప్పుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. టీడీపీకి పట్టున్న జిల్లాల్లో ఆ పార్టీని దెబ్బతీయడమే టార్గెట్‌గా పెట్టుకున్నట్లు తాజా రాజకీయ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ హవా రాష్ట్రమంతా కనిపించినా.. విశాఖలో మాత్రం టీడీపీ నాలుగు అసెంబ్లీ సీట్లను గెలుచుకుంది. ఇలాంటి చోట్ల టీడీపీని సంస్థాగతంగా దెబ్బకొట్టాలని, ఆ పార్టీలోని కీలక నేతలపై వైసీపీ గురిపెట్టింది. ఇందులో భాగంగానే.. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన త్వరలోనే వైసీపీ తీర్థం పుచ్చుకునే అవకాశం కనిపిస్తోంది. రెహమాన్, బాలరాజు, తైనాల, చింతలపూడి వెంకట్రామయ్య ఇప్పటికే వైసీపీ కండువా కప్పుకున్నారు.
ప్రకాశం జిల్లాకు చెందిన కనిగిరి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత కదిరి బాబూరావుకు పార్టీ కండువా కప్పి జగన్ ఆహ్వానించారు. అదే బాటలో టీడీపీ సీనియర్ నేత, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం కూడా పయనించారు. అంతటితో ఆగకుండా ప్రకాశం జిల్లాలో టీడీపీని బలహీన పరిచే పనుల్లో బిజీగా మారారు. మాజీ మంత్రి శిద్దా రాఘవరావు సహా పలువురు జిల్లా స్థాయి నేతలను, ద్వితీయ శ్రేణి నాయకులను తమ వెంట వైసీపీ లాగేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. దాంతో ప్రకాశంజిల్లాలో టీడీపీ ఖాళీ అయిపోతుందా అన్న సందేహాలు పెరుగుతున్నాయి. ఎమ్మెల్సీ పోతుల సునీత, మాజీ ఎమ్మెల్యే కదిరి బాబూరావు, ఎమ్మెల్యే కరణం బలరాం వైసీపీ గూటికి చేరిన నేపథ్యంలో మరికొంతమంది ముఖ్య నేతలు వైసిపి వైపు చూస్తున్నారనిపిస్తోంది. ప్రధానంగా కరణం బలరాంతో ప్రత్యేక అనుబంధం ఉన్న మరికొందరు నేతలు వైసీపీలో చేరేందుకు క్యూ కడుతున్నారనిపిస్తోంది.
కడప జిల్లాలో పులివెందుల సతీష్ రెడ్డి, జమ్మలమడుగు రామసుబ్బారెడ్డి టీడీపీని వీడారు. కడప జిల్లాకు చెందిన మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి ఇదేవిధంగా చక్రం తిప్పుతున్నారు. దాంతో కడప జిల్లాలో టీడీపీకీ కీలకమైన నేతగా మైనారిటీ నేత సుబాన్ బాషాతో టీడీపీకి రాజీనామా చేయించి సుబాన్ బాషాతో పాటు ఆయన అనుచరులను డిప్యూటీ సీఎం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
మరోవైపు కర్నూలు జిల్లా టీడీపీలో కీలక కుటుంబం నుంచి కీలక వ్యక్తి టీడీపీకి గుడ్ బ్ చెప్పారు. ఆయన వైసీపీలో చేరిక ఇంకా ఖరారు కానట్లు తెలుస్తోంది.
ఇంకోవైపు తూర్పు గోదావరి జిల్లా అమలాపురం మున్సిపాలిటీ పరిధిలో ఆపరేషన్ ఆకర్ష చేపట్టారు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్. టీడీపీ నేతల ఇళ్లకు వెళ్లి మరి వైసీపీలో చేరాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు విశ్వరూప్. దాంతో పలువురు టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులు వైసిపిలోకి చేరారు. అమలాపురం మున్సిపల్ మాజీ చైర్మన్ యళ్ల సతీష్ టీడీపీ రాజీనామా చేసి, వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.
అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్సీ శమంతకమణి, ఆమె కుమార్తె మాజీ ఎమ్మెల్యే యామిని బాల కూడా వైసీపీలోకి చేరేందుకు రంగం సిద్ధం చేస్తుకుంటున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
నాలుగైదు రోజులుగా తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి అధికార వైసీపీ గూటికి చేరుతున్న తెలుగు తమ్ముళ్ళ సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కదిరి బాబూరావుతో మొదలైన వలసల పరంపర కేఈ ప్రభాకర్ దాకా కొనసాగింది. అదే బాటలో మరికొందరున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.