English | Telugu
ఐపీఎల్ తో పాటు ఎఫ్ 1 రేస్ కూడా రద్దు!
Updated : Mar 13, 2020
ఢిల్లీలో ఐపీఎల్ 13వ సీజన్ కు సంబంధించిన మ్యాచ్‌లను నిర్వహించకూడదని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఐపీఎల్ మ్యాచ్‌లతో పాటు మిగతా క్రీడా పోటీలపైన కూడా నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. స్టేడియంలో జనం పెద్ద సంఖ్యలో గూమిగూడే అవకాశం ఉండడంతో కరోనా వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలందరూ ఎంతో ఆసక్తిగా తిలకించే ఎఫ్ 1 రేస్ కూడా నిలిపివేయండంతో క్రీడాభిమానులు నిరాశకు గురవుతున్నారు.
కేంద్ర క్రీడామంత్రిత్వశాఖ కరోనా వైరస్ మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సలహాను పాటించాలని, క్రీడా కార్యక్రమాలలో లార్జ్ గెదరింగ్(పెద్దఎత్తున ప్రజలు ఒకచోట హాజరవడం) నివారించాలని BCCIతో సహా అన్ని జాతీయ సమాఖ్యలను కోరింది.
ఇప్పటికే ఐపీఎల్ ను వాయిదా వేయాలని,బెంగళూరులో ఐపీఎల్ మ్యాచ్ లకు ఆతిథ్యం ఇవ్వలేమని కేంద్రానికి కర్ణాటక ప్రభుత్వం లేఖ రాసింది. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఐపీఎల్ ను వాయిదా వేసుకోవాలని సూచించింది. మద్రాస్ హైకోర్టులోనూ వాయిదా కోరుతూ ఓ పిటిషన్ దాఖలైంది. ఇక శివసేన నేతృత్వంలోని మహారాష్ట్ర ప్రభుత్వం ఏకంగా ఐపీఎల్ టికెట్ల అమ్మకాలపై నిషేధం విధించింది. కరోనా వైరస్ భయంతో ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణకు పలు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కూడా వ్యతిరేకత పెరుగుతోంది.
''ఇన్నేళ్లుగా ప్రతీ వేసవిని ధనాధన్ మెరుపులతో అలరించిన ఈ లీగ్ ఇప్పుడైతే అటు స్పాన్సర్లని, ఫ్రాంచైజీలనే కాదు... ఇటు పాలకమండలినీ దడదడలాడిస్తోంది. ఈ నెల 14న జరిగే ఐపీఎల్ పాలకమండలి సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ ప్రకటించినప్పటికీ.. బిజీ షెడ్యూలు వల్ల అటు వాయిదా వేయలేదు. ఇటు వేరే దేశంలో నిర్వహించనూ లేరు. ఎన్నికల సందర్భంగా 2009, 2014లలో విదేశాల్లో నిర్వహించింది. కానీ.. ఇప్పుడున్న 'కరోనా మహమ్మారి' దృష్ట్యా ఏ దేశం నిర్వహణకు సిద్ధంగా లేదు.