English | Telugu

తిరుమలలో రాజకీయ రంగులు... గులాబీ గుబాళింపులు కేసీఆర్ మెప్పు కోసమేనా?

సెప్టెంబర్ 30నుంచి అక్టోబరు 9వరకు జరగనున్న తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు టీటీడీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సకల ఏర్పాట్లు కల్పిస్తోంది. ముఖ్యంగా సౌకర్యాలతోపాటు భక్తుల భద్రతపైనా టీటీడీ దృష్టిపెట్టింది. దాదాపు 6వేల మంది పోలీసులతో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే, తిరుమల నడకదారుల్లో 1650 సీసీ కెమెరాలతో భద్రతను పర్యవేక్షించనున్నారు. ఇక గదుల కేటాయింపు, దర్శనాల్లో సాధారణ భక్తులకే పెద్దపీట వేస్తామని టీటీడీ ఈవో చెప్పుకొచ్చారు.

అయితే, బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు వరకు బాగానే ఉన్నా, అలిపిరి నుంచి తిరుమల వెళ్లే మార్గంలో... గోపురానికి, శ్రీవారి శంఖు చక్రాలకు గులాబీ రంగు వేయడంపై వివాదం చెలరేగింది. గతంలో వీటికి తెలుపు లేదా పసుపు రంగులు వాడేవారు. అయితే, ఇప్పుడు లేత గులాబీ రంగు వేయడం, అది టీఆర్ఎస్ జెండా కలర్ లాగా ఉండటంతో, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను మెప్పించేందుకేనన్న విమర్శలు చెలరేగాయి. ఇటీవల జరిగిన ముఖ్యమంత్రుల మీటింగ్ సందర్భంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలకు రావాలని తెలంగాణ సీఎంను ప్రత్యేకంగా ఆహ్వానించిన జగన్మోహన్ రెడ్డి... కేసీఆర్ మెప్పు కోసమే గోపురానికి, శ్రీవారి శంఖు చక్రాలకు గులాబీ రంగు వేయించారనే ఆరోపణలు వస్తున్నాయి.

అయితే, అలిపిరి టోల్ గేట్ దగ్గర గోపురానికి, శంఖు చక్రాలకు గతంలో వేసిన రంగులనే వేశారంటూ టీటీడీ వివరణ ఇచ్చింది. మెప్పు కోసం ఒక రాజకీయ పార్టీ రంగును వేశామనడంలో నిజం లేదన్నారు. అయితే, టీటీడీ వివరణను ఎవరూ నమ్మడం లేదు. అలిపిరిలో టీఆర్ఎస్ గులాబీ కలర్ డామినేట్ చేస్తోందని, ఇది కచ్చితంగా గులాబీ గుబాళింపేనని అంటున్నారు. అయినా, దేవుడి దగ్గర ఈ రాజకీయ రంగులేమిటని భక్తులు ప్రశ్నిస్తున్నారు. గత సంప్రదాయాలకు విరుద్ధంగా గులాబీ రంగు ఎలా వేస్తారంటూ నిలదీస్తున్నారు. కేసీఆర్ ను మెప్పించేందుకు తిరుమల వేంకటేశ్వరుడి చిహ్నాలకూ గులాబీ రంగులేస్తారా? అంటూ మండిపడుతున్నారు.