English | Telugu
మరో మూడ్రోజులు ముంపే... టేక్ కేర్ హైదరాబాద్... జీహెచ్‌ఎంసీ హైఅలర్ట్
Updated : Sep 26, 2019
వరుసగా రెండోరోజు కూడా హైదరాబాద్‌లో వర్షం దంచికొట్టింది. కుండపోత వర్షానికి హైదరాబాద్ మొత్తం అతలాకుతలమైంది. ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిపోయింది. రోడ్లన్నీ కాలువల్లా, కాలనీలు చెరువుల్లా మారాయి. దాంతో ఇంటి నుంచి బయటకు రావాలంటే జనం భయపడుతున్నారు. ఇక, ప్రధాన రహదారులైతే వాగులను తలపిస్తున్నాయి. నాలాలు పొంగి పొర్లుతుండటంతో, ఎక్కడ ఏ మ్యాన్‌హోల్ నోరు తెరుచుకుని ఉందోనని పాదచారులు బిక్కుబిక్కుమంటూ వెళ్తున్నారు. మరోవైపు, పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలగా, బహదూర్‌పురా మహమూద్‌నగర్‌లో భారీ వర్షానికి ఇంటి గోడ విరిగిపడి వృద్ధురాలు మరణించింది.
మరోవైపు, కుండపోత వర్షానికి హుస్సేన్‌సాగర్‌కు భారీగా వరద నీరు వచ్చిచేరుతోంది. దాంతో లోయర్ ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. మల్లేపల్లి హబీబ్‌నగర్ నాలా దగ్గర ఒక ఇంట్లోకి నడుము లోతు నీళ్లు రావడంతో... ఆ నీటిలో మహిళ ఈత నేర్చుకుంటున్న దృశ్యాలు వైరల్‌గా మారాయి. ఇక, ఉస్మాన్ గంజ్‌లో వర్షపు నీరు ముంచెత్తడంతో వాహనాలు, బైక్స్ కొట్టుకుపోయాయి. దాంతో, వాటిని కాపాడుకునేందుకు వాహనదారులు నానా తిప్పలు పడ్డారు.
కుండపోత వర్షాలు హైదరాబాద్‌ను ముంచెత్తుతుండటంతో జీహెచ్‌ఎంసీ రెస్క్యూ టీమ్స్ నిరంతరం పనిచేస్తున్నాయి. మరో రెండు మూడ్రోజులు ఇదేవిధంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ హెచ్చరించడంతో.... ముందుజాగ్రత్త చర్యలు చేపడుతోంది. అలాగే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, భారీ వర్షం కురుస్తున్నప్పుడు ఇళ్ల నుంచి బయటికి రావొద్దని జీహెచ్‌ఎంసీ అధికారులు సూచిస్తున్నారు. అయితే, 1908 తర్వాత సెప్టెంబర్లో ఈ స్థాయిలో వర్షాలు పడటం ఇదే మొదటిసారని అధికారులు చెబుతున్నారు.