English | Telugu
సంపూర్ణేష్ బాబు కారుని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
Updated : Nov 27, 2019
సినీ నటుడు సంపూర్ణేష్ బాబు ప్రయాణిస్తున్న కారు యాక్సిడెంట్ కి గురైంది. సిద్దిపేట కొత్త బస్టాండ్ వద్ద సంపూర్ణేష్ బాబు కారును ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో సంపూర్ణేష్‌తో పాటు ఆయన భార్య, కూతురుకు గాయాలైనట్లు తెలుస్తోంది. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదం నుంచి ముగ్గురూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. స్థానికులు పోలీసులకి సమాచారం ఇవ్వడంతో వెంటనే వారు ఘటనా స్థలికి చేరుకొని సంపూర్ణేష్ ఫ్యామిలీని ఆసుపత్రికి తరలించారు.
తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం గత యాభై రోజులుగా తాత్కాలిక డ్రైవర్లలో బస్సులు నడిపిస్తోంది. అయితే ఈ తాత్కాలిక డ్రైవర్ల మూలంగా పలు ప్రమాదాలు జరుగుతున్నాయని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే చాలా ప్రమాదాలు జరిగాయి. కొందరు ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం నాడు కూడా హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ మహిళ మరణించింది. ఆ ఘటన జరిగి 24 గంటలు కూడా గడవకముందే.. సంపూర్ణేష్ కి పెను ప్రమాదం తప్పింది. ఏదిఏమైనా తాత్కాలిక డ్రైవర్ల మూలంగా ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుండంతో.. ఆర్టీసీ సమస్యపై ప్రభుత్వం వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.