English | Telugu
సమ్మక్క సారలమ్మ వనప్రవేశంతో ముగియనున్న మేడారం మహా జాతర..
Updated : Feb 8, 2020
మేడారం మహా జాతర ముగింపు దశకు చేరుకుంది. సమ్మక్క సారలమ్మలు వన ప్రవేశం చేయడంతో తెలంగాణ కుంభమేళా ముగుస్తుంది. చెర్న కోలాలు చేతబూనిన శివసత్తుల పూనకాల హోరు సమ్మక్క తల్లికి జై, మమ్మేలు తల్లి జీవించు తల్లి అంటూ మొక్కుల నాదంతో ప్రస్తుతం మేడారం మారుమోగిపోతోంది. మేడారం జనాభా వర్ణమైంది, కోట్ల మంది భక్తుల కొంగు బంగారమై మెరిసిపోయింది. పసుపు పీతాంబరమై మురిసిపోయింది, బెల్లం బంగారు నైవేద్యం అయ్యింది. ఇప్పటి వరకు లక్షలాది మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకుని తిరుగు ముఖం పట్టారు. మొదటిరోజు చిలుకల గుట్ట నుంచి సమ్మక్క తల్లిని పూజారులు అత్యంత భక్తి శ్రద్ధలతో గద్దె పైకి తీసుకువచ్చినప్పటి నుంచి మేడారం భక్తజన సంద్రంగా మారిపోయింది. వనదేవతలు గద్దెలపైకి చేరినప్పటి నుంచి భక్తులు పెద్ద ఎత్తున అమ్మవార్లను దర్శించుకుని ఆశీర్వాదాలు అందుకుంటున్నారు. చిలకలగుట్ట నుంచి చల్పాయ చెట్టు దాకా అక్కడి నుంచి మేడారం గ్రామం దాకా ఇసుక వేస్తే రాలనంత జనం, నిన్న ఒక్క రోజే అమ్మవార్లను ముప్పై ఐదు లక్షల మంది భక్తులు దర్శించుకున్నట్లు తెలుస్తోంది. ఆదివాసి ఆచార సాంప్రదాయాల కళాబృందాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
మేడారం వనదేవతలను తెలంగాణ గవర్నర్ తమిళిసాయ్, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అమ్మవారిని ప్రత్యేకంగా దర్శించుకొని వనదేవతలకు మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారికి బంగారంతో పాటు సారెను కూడ సమర్పించుకున్నారు. ఇక సీఎం కేసీఆర్, ఎంపీ సంతోష్ కుమార్ తో పాటు మంత్రులు సత్యవతి రాథోడ్, ఇంద్రకరణ్ ప్రత్యేక హెలికాప్టర్ లో మేడారానికి చేరుకొని అమ్మవార్లను దర్శించుకున్నారు. ఇవాళ్టితో మేడారం మహా జాతర ముగియనుంది, సాయంత్రం సమ్మక్క సారలమ్మ వనప్రవేశంతో జాతర ముగియనుంది. చివరి రోజు కావడంతో భక్తుల రద్దీ మరింత పెరగనుంది. తెలంగాణ కుంభమేళగా ప్రపంచంలో అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన ఈ జాతరకు కోటి మందికి పైగా జనం హాజరవుతారని అంచనాలున్నాయి.