English | Telugu
కమలనాథుల్లో గుబులు పుట్టిస్తున్న శివసేన...
Updated : Oct 25, 2019
మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుపై ఇంకా సస్పెన్స్ వీడలేదు. 50-50 ఫార్ములా అమలు చేయాల్సిందేనని పట్టుబడుతున్న శివసేన ఇప్పుడు తన గళాన్ని మరింత పెంచింది. అధికారాన్ని చెరిసగం పంచుకోవాల్సిందేనని తేల్చి చెప్పింది. బీజేపీపై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఇక శివసేన అధికారిక పత్రిక సామ్నాలో బీజేపీని విమర్శిస్తూ ప్రచురితమైన ఎడిటోరియల్ వ్యాసం మరింత కలకలం రేపుతోంది. 2014 ఎన్నికలతో పోలిస్తే బిజెపికి ఓట్లు తగ్గడాన్ని ప్రస్తావిస్తూ కమలం పార్టీని ఎండగట్టింది. ఇప్పటికైనా గుణపాఠం నేర్చుకోవాలి అంటూ కమలనాథులకు శివసేన సూచించింది.
మీ అంతట మీకు మహారాష్ట్ర ప్రజలు మెజారిటీ ఇవ్వలేదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అంటూ బిజెపికి చురకలు వేసింది. తమవల్లే బిజెపి గెలిచింది అంటూ పరోక్ష వ్యాఖ్యలు చేసింది. శివాజీ పేరుతో అవకాశవాద రాజకీయాలను సతారా ప్రజలు అనుమతించరు అంటూ వ్యాఖ్యానించింది. సతారాలో ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన ఉదయన్ రాజె భోంస్లే పరాజయాన్ని ప్రస్తావిస్తూ వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా ఎన్సీపీ పై ప్రశంసలు గుప్పించింది. మహారాష్ట్ర లోని 288 అసెంబ్లీ స్థానాలకు గానూ తాజా ఫలితాలతో బీజేపీ 103 సీట్లు శివసేన 56 సీట్లలో విజయం సాధించాయి. అయితే సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు శివసేన కొత్త పల్లవి అందుకుంది, ఏకంగా సీఎం పీఠంపైనే కన్నేసింది. అధికారం చెరిసగం పంచుకోవాలి అన్న మెలికపెట్టింది. బీజేపీ కాదంటే కాంగ్రెస్ ఎన్సీపీతో కలిసి అధికారాన్ని పంచుకునే అవకాశం కూడా శివసేనకుంది.
ఇదే ఇప్పుడు కమలనాథుల్లో గుబులు పుట్టిస్తోంది. మరో పక్క ఆదిత్య ఠాక్రేను ముఖ్యమంత్రిగా చేయాలన్న డిమాండు శివసేన శ్రేణుల్లో మరింత గట్టిగా వినిపిస్తున్నాయి. ఆదిత్య ఠాక్రే భవిష్యత్ సీఎం అంటూ మహారాష్ట్ర వ్యాప్తంగా శివసేన కార్యకర్తలు భారీ పోస్టర్ లు ఏర్పాటు చేయడం బీజేపీ శ్రేణులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దాంతో శివసేనను దారికి తెచ్చుకునేందుకు బీజేపీ నేతలు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అటు సామ్నాలో ఎడిటోరియల్ వ్యవహారంపై శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ స్పందించారు. అధికార గర్వం తలకెక్కినప్పుడే ప్రజలు దాన్ని దించుతారు అంటూ తమ పార్టీ అధినేత ఉత్తవ్ వ్యాఖ్యలు చేశారని అదే ఎడిటోరియల్లో వచ్చింది అన్నారు, దీనిపై ఎలాంటి వివాదమూ లేదన్నారు.