English | Telugu
హర్యానాలో వేడెక్కిన సీఎం కుర్చీ ఆట!!
Updated : Oct 25, 2019
హర్యానాలో స్వతంత్రుల మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. కనీస మెజారిటీకి కావలసిన సంఖ్యను సమకూర్చుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇప్పటి వరకు ఐదుగురు ఇండిపెండెంట్ అభ్యర్ధులు మద్దతు పలకడంతో ఇంకొందర్ని ఆకట్టుకొనేందుకు ముమ్మరంగా కృషి చేస్తోంది. మోదీ నేతృత్వం లోని బిజెపికి తాను బేషరతుగా మద్దతు ఇస్తున్నట్టు హర్యానా లోకీత్ పార్టీ నేత స్వతంత్ర అభ్యర్థి గోపాల్ ఖండ ప్రకటించారు. ఆయన బాటలోనే ఇండిపెండెంట్ లుగా గెలిచిన రంజిత్ చౌతాలా, సోంబీర్ సంగ్వాన్, నయన్ పాల్ రావత్, ధరంపాల్ గోండర్ సైతం కమలదళానికి మద్దతిచ్చేందుకు ముందుకొస్తున్నారు.
హర్యానాలో ప్రభుత్వ ఏర్పాటుకు కావలసిన మ్యాజిక్ ఫిగర్ 46, ఈ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా బిజెపి నిలిచిన కనీస మెజారిటీకి అడుగు దూరంలో నిలిచిపోయింది. నలభై స్థానాలను గెలిచిన బీజేపీ మళ్లీ అధికారం నిలబెట్టుకోవాలంటే మరో ఆరుగురి మద్దతు కావాలి. దాంతో స్వతంత్రులతో పాటు జెజెపిని మచ్చిక చేసుకునే ప్రయత్నాలు సాగుతున్నాయి. అటు కాంగ్రెస్ ముప్పై ఒక్క స్థానాల్లో విజయం సాధించింది. ఎనిమిది చోట్ల స్వతంత్రులు గెలవగా ఒకచోట ఐఎన్ఎల్డీ అభ్యర్థి విజయం సాధించారు. మరో పక్క హర్యానాలో తాజా పరిస్థితిని చర్చించేందుకు సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ఢిల్లీ వెళ్లారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాతో ఆయన సమావేశం అయ్యారు.
తమకు మద్దతు ఇస్తున్న స్వతంత్రులను సైతం బీజేపీ నేతలు ఢిల్లీ చేరినట్టు తెలుస్తోంది. ఒక పక్క బిజెపి మరో పక్క కాంగ్రెస్ పార్టీలు పోటా పోటీగా సంకీర్ణ సర్కార్ ఏర్పాటుకు పావులు కదుపుతూ ఉండటంతో హర్యానాలో రాజకీయం హీట్ పెంచుతోంది. జెజెపితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ భావిస్తుంది. అయితే కాంగ్రెస్ కు అవకాశం ఇవ్వకుండా తమవైపే జెజెపిని లాక్కోవాలి అన్నది బిజెపి నేతల వ్యూహంగా తెలుస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో జెజెపి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.
ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలి అన్నది నిర్ణయించేందుకు జెజెపి అధినేత దుష్యంత్ చౌతాలా పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. తొంభై స్థానాలున్న హర్యానాలో జెజెపి పది స్థానాలను దక్కించుకుంది, మరో వైపు కాంగ్రెస్ అధినేత్రి సోనియా నివాసం వద్ద కాంగ్రెస్ కీలక నేతలు భేటీ అయ్యారు. హర్యానాలో తాజా పరిణామాలు ఎన్నికల ఫలితాలపై చర్చించారు, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ సహా పలువురు నేతలు ఈ భేటీకి హాజరయ్యారు. మొత్తం మీద స్వతంత్రుల మద్దతుతో హర్యానాలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా లేక కాంగ్రెస్,జెజెపిలు కలిసి సంకీర్ణ సర్కారును ఏర్పాటు చేస్తాయా అన్నది ఉత్కంఠ రేపుతోంది.