English | Telugu

ముందు నుయ్యి వెనుక గొయ్యి అంటే ఇదే... కేసీఆర్‌తో పెట్టుకుంటే ఇలాగే ఉంటుందా?

ఊహించినట్లే ఆర్టీసీ కార్మికులకు యాజమాన్యం షాకిచ్చింది. సమ్మె విరమించినా కార్మికులను విధుల్లోకి తీసుకునేది లేదని తేల్చిచెప్పింది. ఇష్టమొచ్చినట్లు విధులకు గైర్హాజరై... మళ్లీ ఇష్టమొచ్చినప్పుడు విధుల్లో చేరతామంటే... చట్ట ప్రకారం కుదరదని ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ స్పష్టంచేశారు. ఒకవైపు పోరాటం కొనసాగుతుందని ప్రకటిస్తూనే, మరోవైపు సమ్మె విరమించి విధుల్లో చేరతామని ఆర్టీసీ జేఏసీ ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రభుత్వం గానీ, ఆర్టీసీ యాజమాన్యం కానీ... సమ్మె చేయమని చెప్పలేదని... కార్మికులే తమంతట తాముగా విధులకు గైర్హాజరై... చట్ట విరుద్ధంగా సమ్మెలో ఉన్నారన్న సునీల్ శర్మ... ఇష్టానుసారంగా విధులకు గైర్హాజరై... మళ్లీ నచ్చినప్పుడు విధుల్లో చేరతామంటే ఏ ప్రభుత్వరంగ సంస్థలో సాధ్యంకాదని స్పష్టంచేశారు.

బతుకమ్మ, దసరా, దీపావళి లాంటి అతిముఖ్యమైన పండగల సమయంలో సమ్మెకు దిగి ప్రజలకు తీవ్రమైన అసౌకర్యం కలిగించారన్న ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ... ఇప్పుడు మళ్లీ విధుల్లో చేరతామంటే చట్ట ప్రకారం కుదరదన్నారు. గౌరవ హైకోర్టు ఆదేశాల మేరకు కార్మికశాఖ కమిషనర్ నిర్ణయం తీసుకున్నాక... ఆర్టీసీ యాజమాన్యం తదుపరి చర్యలు చేపడుతుందని తెలిపారు. హైకోర్టు సూచించిన ప్రక్రియ ముగిసేవరకు కార్మికులను విధుల్లో చేర్చుకోవడం కుదరని తేల్చిచెప్పారు. ఏ నిర్ణయమైనా సరే, అంతా చట్ట ప్రకారం జరుగుతుందని, అప్పటివరకు సంయమనం పాటించాలని ఆర్టీసీ కార్మికులకు సూచించారు.

ఆర్టీసీ కార్మికులు ఇప్పటికే యూనియన్ల మాట విని నష్టపోయారని, ఇప్పుడు మరోసారి డిపోల దగ్గర ఉద్రిక్తతలు సృష్టించి కష్టాలను కోరి తెచ్చుకోవద్దని హెచ్చరించారు. డిపోల దగ్గర శాంతిభద్రతల సమస్య సృష్టించవద్దని, తాత్కాలిక డ్రైవర్లను, కండక్టర్లను అడ్డుకోవద్దని వార్నింగ్ ఇఛ్చారు. అన్ని డిపోల దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటుచేసి పరిస్థితిని సమీక్షిస్తున్నామన్న ఆర్టీసీ ఎండీ.... ఎవరైనా చట్టాలను ఉల్లంఘిస్తే... చట్టపరమైన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. హైకోర్టు సూచించిన ప్రకారం లేబర్ కమిషనర్ నిర్ణయం తీసుకునేవరకు సంయమనం పాటించాలని కార్మికులకు ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ సూచించారు.