English | Telugu
జూబ్లీ కొండల్లో రేవంతన్న స్టార్ క్యాంపెయినంగా మజాకా!
Updated : Nov 1, 2025
ఇలా అజారుద్దీన్ ని కేబినెట్ లో చేర్చుకుని.. అలా ఆయన్ను తన ప్రచార రథంఎక్కించి.. జూబ్లీ హిల్స్ ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక మ్యాజిక్ చేశారు. సీఎం రేవంత్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా శుక్రవారం (అక్టోబర్ 31)న నిర్వహించిన రోడ్ షో తో ఒక మ్యాజికల్ షో చేశారని చెప్పవచ్చు. ఒక వైపు అజారుద్దీన్ ను పక్కన పెట్టుకుని చేసిన రేవంత్ రెడ్డి రోడ్ షో నియోజకవర్గంలోని మైనారిటీలను ఆకర్షించింది. అదే సమయంలో మధ్య మధ్యలో పిజేఆర్ కుమార్తె విజయారెడ్డిని సైతం తన ప్రచారంలో ఒక భాగం చేస్తూ రేవంత్ రెడ్డి ఓటర్లను ఆకట్టుకున్నారని పరిశీలకులు అంటున్నారు. అక్కడితో ఆగకుండా నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో ఉన్న సెటిలర్స్ ను మెప్పించేలా.. ఎన్టీఆర్ విగ్రహ ప్రతిష్ఠాపన ప్రస్తావన చేసి.. దటీజ్ రేవంత్ అనిపించుకున్నారంటున్నారు.
టీమిండియా మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్ రేవంత్ కేబినెట్ లో మంత్రిగా చేరారు. శుక్రవారం (అక్టోబర్ 31) మధ్యాహ్నం ఆయన చేత రాజ్ భవన్ లో గవర్నర్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ వెంటనే సాయంత్రం అజారుద్దీన్ ను వెంటపెట్టుకుని రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ లో రోడ్ షోలో పాల్గొన్నారు అజారుద్దీన్ ఇక్కడ ఒక సారి పోటీ చేసి ఓడిపోతే ఆయన్ను ఎమ్మెల్సీ చేసి అటు పిమ్మట మంత్రిగానూ ప్రమాణం చేయించి.. మీ ముందుకు తెచ్చానని ఈ సందర్భంగా రేవంత్ ప్రజలకు చెప్పారు. అజార్ కూడా నవీన్ యాదవ్ గెలుపునకు తన వంతు కృషి చేస్తానన్నారు.
ఇక పీజేఆర్ తనయ విజయారెడ్డి సంగతి సరే సరి. అప్పట్లో మాస్ లీడర్ పీ. జనార్ధన్ రెడ్డి చనిపోయినపుడు టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయ వైరుధ్యాలను పక్కన పెట్టి ఆయన కుటుంబ సభ్యులను ఏకగ్రీవం చేస్తానంటే.. ఇదే కేసీఆర్ పీజేఆర్ భార్యా పిల్లల్ని మూడు గంటల పాటు నిలబెట్టి ఒట్టి చేతులతో పంపించేశారని గుర్తు చేశారు. అందుకు సాక్ష్యం విజయారెడ్డేనని రేవంత్ ఆమెను పక్కన పెట్టుకుని మరీ చెప్పడం ద్వారా ప్రజల సెంటిమెంట్ ను టచ్ చేశారు.
ఎక్కే ఫ్లైటు దిగే బెంజికార్లే జీవితంగా ఇన్నాళ్లు బతికిన బిల్లా రంగాలు ప్రస్తుతం ఆటోలో తిరుగుతూ.. మిమ్మల్ని మాయ చేయడానికి వస్తున్నారనీ.. సొంతింటి ఆడబిడ్డనే రోడ్డున పడేసిన వీరు.. మాగంటి సునీత కార్చే కన్నీళ్ల ద్వారా గెలవాలని చూస్తున్నారనీ.. వీరి వేషాలను చూసి మోసపోవద్దని జూబ్లీ ఓటర్లను రేవంత్ హెచ్చరించారు.
ఇక మైత్రీ వనంలో అందరికీ ఆరాధ్య దైవం ఎన్టీఆర్ కి విగ్రహం పెట్టించే బాధ్యత నవీన్ కి అనిల్ కి అప్పగించాననీ.. తానే స్వయంగా వచ్చి ఆ విగ్రహాన్ని ఆవిష్కరిస్తానని మాటిస్తూ... ఇటు సెటిలర్లను సైతం ఆకట్టుకునే ప్రయత్నం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అంటే ఇటు అజారుద్దీన్ ద్వారా మైనార్టీ ఓట్లను, ఆపై ఈ ప్రాంతంలో మాస్ లీడర్ గా ఉన్న పీజేఆర్ అభిమానగణాన్ని.. ఇక కృష్ణానగర్ వంటి ప్రాంతాల్లో అధికంగా నివసించే సెటిలర్లను ఆకట్టుకునేలా రేవంత్ రోడ్ షో సాగింది. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా మీ మొహం చూసిన వారు కాదని.. ఇదే నియోజవకర్గం నుంచి మూడు సార్లు గెలిచిన గోపీనాథ్ ఒక్కటంటే ఒక్క సారి కూడా అసెంబ్లీలో ఈ సెగ్మెంట్ గురించి మాట్లాడింది లేదని.. ఆపై ఆయన ఈ పదహారునెలల్లో ఈ నియోజకవర్గానికిది కావాలి అది కావాలని తన దగ్గరకు ఒక కాగితం కూడా తేలేదని అన్నారు సీఎం రేవంత్.
అలాగని మాగంటి కుటుంబంపై తనకు ఎలాంటి వ్యతిరేకత లేదని.. ఆ ఫ్యామిలీ పట్ల సానుభూతి అలాగే ఉందని.. అయితే.. గత మూడు పర్యాయాల పాటు ఏమీ చేయలేని వారు నాలుగోసారి గెలిపిస్తే మాత్రం ఏం చేయగలరనీ ప్రశ్నించారు. గత రెండు నెలలుగా ఈ నియోజక వర్గానికి తమ ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేసింది కాబట్టి.. ఇక్కడ గల్లీ గల్లీ తెలిసిన వ్యక్తి.. నవీన్ యాదవ్ ని గెలిపించి.. నాకు సిటీలో ఒక కుడి భుజాన్ని అందివ్వాల్సిందిగా కోరారు సీఎం రేవంత్. మరి సీఎం రేవంత్ అభ్యర్ధన ఇక్కడి ఓటర్లు మన్నిస్తారా.. లేదా? తెలియాలంటే నవంబర్ 14 వరకూ వేచి చూడాల్సిందే.