English | Telugu

బీసీ రిజర్వేషన్లు.. కోల్డ్ స్టోరేజీలోకేనా?

తెలంగాణలో ఇటీవలి కాలంలో రాజకీయంగా ఎంత చర్చనీయాంశమైందో.. అంతకు మించి వివాదాస్పదమైన బీసీ రిజర్వేషన్ల అంశం ఇక కోల్డ్ స్టోరేజీలోకి వెళ్లిపోయినట్లేనా? తెలంగాణ స్థానిక ఎన్నికలలో బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అంశాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న రేవంత్ సర్కార్.. ఆ విషయంలో చేతులెత్తేసిందా? ఈ విషయంలో కోర్టు తీర్పు ప్రతికూలంగా వచ్చే అవకాశాలున్నాయని తెలిసినా తగ్గేదే లే అంటూ ముందుకు వెళ్లిన రేవంత్ సర్కార్ చివరికి ఇది జరిగేది లే.. అని ఉసూరు మందా అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. సుప్రీం కోర్టులో కూడా చుక్కెదురైన తరువాత కూడా రేవంత్ సర్కార్ బీసీ రిజర్వేషన్ల అంశంలో ముందుకే సాగుతామని సంకేతాలిచ్చింది. ఈ విషయంపై గురువారం (అక్టోబర్ 23)న జరిగిన కేబినెట్ సమావేశంలో చర్చించి కీలక నిర్ణయం తీసుకుంటామన్న సంకేతాలిచ్చింది.

అయితే గురువారం (అక్టోబర్ 23) సుదీర్ఘంగా జరిగిన కేబినెట్ భేటీలో ఈ అంశంపై కనీసం చర్చ కూడా లేకపోవడంతో రేవంత్ సర్కార్ రిజర్వేషన్ల అంశాన్ని కోల్ట్ స్టోరేజీలో పెట్టేసినట్లేనన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. అంటే కాంగ్రెస్ దింపుడు కళ్లెం ఆశ కూడా వదిలేసుకుని.. రిజర్వేషన్ల ఊసెత్తకుండానే ‘స్థానిక’ ఎన్నికలకు సమాయత్తం అవుతోందని అవగతమౌతోంది.

ఎందుకంటే రిజర్వేషన్ల అంశం చర్చించకుండా.. స్థానిక ఎన్నికలలో పోటీకి ఇంత కాలం ఉన్న ఇద్దరు పిల్లలు అన్న నిబంధనను రద్దుపై చర్చింది, ఆమోదం తెలిపింది. ఇందు కోసం పంచాయతీరాజ్ చట్టంలో మార్పు చేయడానికి కేబినెట్ తీర్మానించింది. దీంతో స్థానికి ఎన్నికలలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తుతానికి అటకెక్కించేసినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.