English | Telugu
రిలయన్స్ లక్షల కోట్ల సంపద ఆవిరి
Updated : Mar 9, 2020
క్రూడాయిల్ దెబ్బకు ముఖేష్ అంబానీ లక్షల కోట్ల సంపద ఆవిరి అయిపోయింది. భారీగా షేర్ల విలువ పడిపోయింది. కరోనా వైరస్ కారణంగా చమురు ధరలు భారీగా పడిపోయాయి. దీంతో ఆయిల్ మార్కెట్ నష్టాల్లో ఉంది. ఈ ప్రభావం ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ పైనా పడింది. దీంతో మార్చి 9వ తేదీన మార్కెట్ క్యాపిటలైజేషన్ (M-Cap) పరంగా దేశంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) టాప్‌లో నిలిచింది. రిలయన్స్ ఇండస్ట్రీస్‌ను రెండో స్థానంలోకి నెట్టి వేసింది.
ఇటీవల రూ.10 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌ను క్రాస్ చేసిన ఇండియన్ కంపెనీగా రిలయన్స్ నిలిచింది. అయితే చమురు మార్కెట్ దెబ్బతో రిలయన్స్ M-Cap డిసెంబర్ 2019 రికార్డ్ హైతో పోల్చుకుంటే రూ.2.7 లక్షల కోట్లు ఆవిరైంది.
2008 తర్వాత తొలిసారి రిలయన్స్ షేర్ ఇంత దారుణంగా పడిపోయింది. ఇందుకు అంతర్జాతీయ చమురు మార్కెట్ ప్రభావమే. రిలయన్స్ కంపెనీ షేర్ హోల్డర్స్ సంపద ఒక్కరోజులోనే ఏకంగా రూ.1 లక్ష కోట్లు ఆవిరైంది. క్రూడాయిల్ ధరలు 31 శాతం వరకు పడిపోయాయి. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 11.31 డాలర్లు లేదా 25 శాతం తగ్గి 33.96 డాలర్లకు పడిపోయింది. ఫిబ్రవరి 12, 2016 (31.02 డాలర్లు) తర్వాత ఇది కనిష్టం. జనవరి 17, 1991 గల్ఫ్ వార్ తర్వాత క్రూడాయిల్ ధరలు అత్యంత భారీగా పడిపోవడం ఇదే మొదటిసారి. అంటే దాదాపు 30 ఏళ్ల తర్వాత ఇంతలా పడిపోయాయి.