English | Telugu

ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణపై సీబీఐ విచారణ

క్రికెట్ బెట్టింగ్ వ్యవహారం లో గుంటూరు అర్బన్ ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణ పూర్తిగా ఇరుక్కున్నారు. ఏపీ హైకోర్టు ఆదేశాల మేర‌కు గుంటూరుఅర్బన్‌ ఎస్పీపై సీబీఐ విచారణ షురూ అయింది. క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో ముగ్గురిని అక్రమంగా నిర్బంధించారనే కేసులో గుంటూరు అర్బన్ ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణపై సీబీఐ విచారణ చేస్తోంది. ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ అధికారులు సోమ‌వారం నాడు విచారణ ప్రారంభించారు.

గుంటూరు జిల్లా నారా కోడూరుకు చెందిన ముగ్గురిని క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంలో సీసీఎస్‌ పోలీసులు గతేడాది అక్టోబర్‌లో అదుపులోకి తీసుకున్నారు. అయితే, వారిని వెంటనే కోర్టులో హాజరుపరచకుండా విచారణ పేరుతో నిర్భందించారు. ఏదైనా కేసులో అరెస్టయిన నిందితులను 24గంటల లోపు కోర్టులో హాజరు పర్చాల్సి ఉండగా.. అలా జరగకపోవడంతో నిందితులు హైకోర్టుని ఆశ్రయించారు. నిబంధనలు పక్కన పెట్టి విచారణ పేరుతో తమని రోజుల తరబడి వేధించారని పిటిషన్‌లో పేర్కొన్నారు. డబ్బు కోసమే ఇలా చేశారని బాధితులు ఆరోపించారు.

దీనిపై హైకోర్టు ప్రాథమిక విచారణకు ఆదేశించగా నిర్బంధం నిజమేనని తేలింది. మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలన్న పిటిషనర్ల విజ్ఞప్తి మేరకు హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది.

ఈ వ్యవహారంలో నిందితులను నిర్బందించింది సీసీఎస్‌ పోలీసులే అయినా దీని వెనుక మొత్తం క‌థ న‌డిపింది ఎస్పీనే అట‌. ఎస్పీ ఆదేశాల మేరకే ఇలా చేశారని పిటిషనర్లు ఆరోపించారు. ఐపీఎస్ అధికారి కావటంతో ఈ వ్యవహారాన్ని సీబీఐ విచారించాలంటూ రెండు వారాల క్రితం హైకోర్టు ఆదేశాలు జారీచేసింది.

హైకోర్టు ఆదేశాలతో దిల్లీ నుంచి వచ్చిన సీబీఐ అధికారులు సోమవారం గుంటూరుకు వచ్చారు. అక్రమ నిర్బంధం వ్యవహారంపై ఆరా తీశారు. చేబ్రోలు పోలీసులతో పాటు సీసీఎస్‌ పోలీసుల నుంచి వివరాలు సేకరించి రహస్యంగా విచారిస్తున్నారు.