English | Telugu
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం రద్దు :- డబ్బు కట్టాల్సిందే అంటున్న ప్రభుత్వం
Updated : Nov 20, 2019
ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్సలు సులభతరం చేస్తునే సర్కారు ఆసుపత్రులను మాత్రం పేదలకు దూరం చేస్తూ కొత్త భారం మోపనుంది. ఓపీ నుంచి ఆపరేషన్ తర్వాత పడకల వరకు చార్జీలు వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న జిల్లా బోధనాసుపత్రుల్లో నిరుపేదలకు ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న ఉచిత వైద్యం ఇక పై ఖరీదు కానుంది. చేతిలో రూపాయి లేకపోయినా ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు అన్ని సేవలు ఉచితంగా అందుతున్నాయి.
దూది నుండి సూది వరకు ఆపరేషన్ నుంచి ఆహారం.. పడకల వరకు అన్నింటిని ప్రభుత్వమే సమకూరుస్తుంది. దీంతో నిరుపేదలకు ఆరోగ్య భరోసా లభిస్తుంది. అయితే ఈ విధానానికి ప్రభుత్వం త్వరలోనే స్వస్తి చెప్పాలని నిర్ణయించుకుంది. జిల్లా బోధనాసుపత్రులను స్వతంత్ర సంస్థలుగా ప్రకటించి వాటి రోజు వారీ ఖర్చులను అవే సంపాదించుకునేలా ప్రణాళిక సిద్ధం చేస్తుంది. ఆసుపత్రులకు వైద్యం కోసం వచ్చేవారికి అందించే సేవలకు గాను నిర్ణీత రుసుమును వసూలు చేసుకునేలా చేస్తుంది ప్రభుత్వం. ఆ బాధ్యతల నుంచి తప్పుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తొంది. దీనికి నలుగురు వైద్యాధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది.ఈ కమిటీ తన ప్రతిపాదనలను త్వరలోనే సమర్పించనుంది. హైదరాబాద్ లోని నిమ్స్ , విశాఖలో విమ్స్ తరహాలో రాష్ట్రంలోని 11 బోధనాస్పత్రులు, 13 జిల్లా ఆసుపత్రులను స్వతంత్ర సంస్థలుగా మార్చాలని ప్రభుత్వం భావిస్తుంది.సాధారణంగా ఒక ఆసుపత్రిని నెల రోజుల పాటు నడిపించటానికి కోటి రూపాయల నుంచి ఒకటిన్నర కోట్ల వరకూ ఖర్చు అవుతాయి.
ఇప్పుడు ఈ ఖర్చు నుంచి తప్పుకోవాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టు సమాచారం.బోధన జిల్లా ఆస్పత్రుల్లో స్వతంత్ర సంస్థలుగా మార్చడం వల్ల ఓపీ నుంచి స్కానింగ్ శస్త్ర చికిత్సల వరకూ రోగులు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.ఓపీకి ఆస్పత్రి స్థాయిని బట్టి పది రూపాయల నుంచి ఇరవై రూపాయల వరకు వసూలు చేస్తారు. రక్త పరీక్షలు స్కానింగ్ లు కూడా డబ్బులు వసూలు చేస్తారు. ఇన్ పేషెంట్ కిచ్చే గదులకు చార్జీల వేస్తారు. ఇలా వచ్చే నిధులను ఆసుపత్రుల నిర్వహణ కొత్త పరికరాల కొనుగోలు సిబ్బంది జీతాలకు ఉపయోగిస్తారు. ప్రస్తుతం బోధనాస్పత్రుల్లో విధులు నిర్వహిస్తున్న వైద్యుల్లో ఎక్కువ మంది విశాఖ, విజయవాడ, గుంటూరు, తిరుపతి వంటి ప్రధాన నగరాల్లో విధులు నిర్వహించాలని భావిస్తున్నారు. దీనివల్ల ఒంగోలు , అనంతపురం , నెల్లూరు బట్టి పలు చోట్ల పోస్టింగ్ లు తీసుకునే వైద్యులు పై డిప్యుటేషనపై మళ్లీ ప్రధాన నగరాలలోని ఆసుపత్రులకు చేరుతున్నారు. దీనిని నియంత్రించి ఏ ప్రాంతానికి చెందిన వారు అక్కడే ఉండాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం స్వతంత్ర సంస్థ లుగా మార్చాలని నిర్ణయించింది. కానీ ఈ డిప్యుటేషన్ ల కంటే స్వతంత్ర సంస్థలుగా మార్చడం వల్లే ఎక్కువ ఇబ్బందులు వస్తాయని తెలుస్తొంది.స్వతంత్ర సంస్థగా మార్చాలంటే ముందు ఏపీ మెడికల్ సర్వీస్ రూల్స్ చట్టాన్ని సవరణలు చేయాలి.దీనిని వైద్యులు వ్యతిరేకిస్తున్నారు.
ప్రస్తుతం స్వతంత్ర సంస్థగా ఉన్న విమ్స్ కు వచ్చే రోగుల నుంచి రుసుములు వసూలు చేస్తున్నారు. దీంతో ఈ ఆసుపత్రి నెలసరి ఆదాయం ఐదు లక్షల వస్తుంది. అయితే ఈ నిధులు శానిటేషన్ సెక్యూరిటీ సిబ్బంది జీతాలు చెల్లించడానికి కూడా సరిపోవడం లేదని సంబంధిత అధికారులు చెబుతున్నారు. డాక్టర్లూ, నర్సులూ, ఫార్మాసిస్ట్ లు కూడా విమ్స్ నుంచే జీతాలు ఇచ్చి ఉంటే ఆ ఆసుపత్రి ఎప్పుడు మూతతపడేదని వ్యాఖ్యలూ వినిపిస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయం పై వైద్య సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో సుమారు యాభై వేల మంది ఉద్యోగులున్న ఆర్టీసీని సర్కారులో విలీనం చేస్తున్నప్పుడు నిరుపేద రోగులకు సేవలందించే నాలుగు వేల మంది వైద్యులు సిబ్బంది ఉన్న జిల్లా బోధనాసుపత్రుల్లోనూ స్వతంత్ర సంస్థలుగా మార్చడం సమంజసమా అని ప్రశ్నిస్తున్నారు.