English | Telugu
ఇసుక దెబ్బ.. రాత్రిపగళ్లు క్యూలోనే.. రోధిస్తున్న ట్రాక్టర్ డ్రైవర్లు
Updated : Nov 20, 2019
కిలోమీటర్ల పొడవున క్యూలో వందల ట్రాక్టర్ లు.. రాత్రి పగలు అనే తేడా కూడా ఉండదు. శివ రాత్రి జాగరణ కాదు.. ఇసుక జాగరణ.. ట్రాక్టర్ ల డ్రైవర్లు, ఓనర్లు.. పగలు రాత్రి.. తిండీతిప్పలు.. నిద్రాహారాలు మాని నడిరోడ్డుపై జాగారం చేస్తున్నారు. ఈ జాగారం చేస్తుంది ఎక్కడో కాదు స్వయానా సీఎం జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడప కావడం విశేషం. ప్రభుత్వానికి ఆన్ లైన్ లో రూ.3,150 రుపాయలు చెల్లించి.. ఒక రాత్రి ఒక పగలు రోజంతా క్యూలో రోడ్డుపై జాగారం చేస్తే చివరకు ఒకే ఒక ట్రాక్టరు ఇసుక తీసుకెళ్తున్నామని ట్రాక్టర్ డ్రైవర్లు, ఓనర్లు తమ గోడును వెళ్లగక్కుతున్నారు. గత కాంగ్రెస్ , టీడీపీ పాలనలో అన్ని ఏళ్ళలో ఇసుక కోసం ఇన్ని కష్టాలు ఎన్నడూ చూడలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏంటో కొత్త పాలసీలు అంటూ.. నగదు ఒక చోట, ఇసుక డంపింగ్ స్టాకు పాయింట్లు మరో చోట ఉంటున్నాయి. పాయింట్ కి వెళ్తే కిలోమీటర్ల పొడవునా క్యూలు ఉండటంతో.. ఎందుకు ఈ ప్రభుత్వం మమ్మల్ని ఇన్ని కష్టాలు పెడుతుందంటూ ట్రాక్టర్ల డ్రైవర్లు, ఓనర్లు రోదిస్తున్నారు.
కడప జిల్లాలో 50 మండలాలకు గాను రాజంపేట, పెనగలూరు, నందలూరు, ప్రొద్దుటూరు, పెండ్లిమర్రి, సిద్దవటం, వేంపల్లె, చక్రాయపేట ఇలా 8 మండలాల్లో మాత్రమే ఇసుక రీచ్ లు ప్రభుత్వం గుర్తించింది. జిల్లాలో కడప, పులివెందులలో మాత్రమే డంపింగ్ స్టాక్ పాయింట్ లను ఏర్పాటు చేసింది. ఈ డంపింగ్ పాయింట్ల వద్ద వందల ట్రాక్టర్ లు కిలోమీటర్ల కొద్ది క్యూలో బారులు తీరుతున్నాయి. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం వరకు మాత్రమే ట్రాక్టర్ లకు లోడ్ చేస్తారు. ఆ తరువాత రాత్రి నిలిపివేస్తారు. మిగిలిన వందల ట్రాక్టర్లు తెల్లవారే వరకు రోడ్ల పై క్యూలో ఉండక తప్పదు. దీనికితోడు.. రాత్రి పగలు అనే తేడా లేకుండా అక్రమంగా ఇసుకను నింపి పంపుతున్నట్లు కొందరు ఆరోపిస్తున్నారు. అధికారికంగా ఆన్ లైన్ లో డబ్బులు చెల్లించి టోకెన్ లతో క్యూలో ట్రాక్టర్ లు పెడితే తమకు మాత్రం 24 గంటలు గడిచినా ఒక్క ట్రాక్టర్ ఇసుక కూడా తీసుకెళ్లలేకపోతున్నామని కొందరు డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.