English | Telugu
మంత్రి ఆదిమూలపు సురేష్ ను క్వారంటైన్‌కు పంపిస్తారా?
Updated : Apr 10, 2020
మంత్రి ఆదిమూలపు సురేష్ హైదరాబాద్ వెళ్లడంపై అచ్చెన్నాయుడు ట్వీట్ చేశారు. లాక్ డౌన్ ఆంక్షల సమయంలో మంత్రి ఏపీ నుంచి తెలంగాణకు ఎలా వెళ్లారని అచ్చెన్నాయుడు ట్వీట్ లో ప్రశ్నించారు. గతంలో లాక్ డౌన్ ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రజలను బోర్డర్‌లో ఆపేసిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. గంటల తరబడి గర్భిణీలు, విద్యార్థులను రోడ్లపై కూర్చోబెట్టారు. చంద్రబాబు వచ్చినా క్వారంటైన్ కు వెళ్లాల్సిందే అని అన్నారు. ప్రజా ఆరోగ్యం విషయంలో మంచిదే కానీ.. ఇదేమిటని ఆయన ట్వీట్ చేశారు.
14 రోజులపాటు క్వారంటైన్లో ఉంటామంటేనే రాష్ట్రంలోకి అడుగుపెట్టనిస్తామని తేల్చి చెప్పిన వైసిపి ప్రభుత్వ పెద్దలు తమ విషయం వచ్చేసరికి మాత్రం ఏపీ, తెలంగాణ మధ్య యథేచ్ఛగా తిరిగేస్తున్నారు. ఇటీవలే ఓ పెద్దాయన సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళం ఇవ్వడం కోసం హైదరాబాద్ నుంచి ఆంధ్రా వచ్చారు. ముందు రోజు కేసీఆర్‌కు చెక్ అందజేసిన ఆయన.. తర్వాతి రోజు జగన్‌కు చెక్ ఇచ్చి ఫొటో దిగారు. ఇప్పుడేమో మంత్రి ఆదిమూలపు సురేష్ లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించి హైదరాబాద్ వెళ్లాడు. మంత్రి తిరిగి రాష్ట్రానికి వచ్చినప్పుడు ప్రభుత్వం ఆయన్ను క్వారంటైన్‌కు పంపిస్తుందా? అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.