English | Telugu
కన్నా లక్ష్మీనారాయణను తొలగించింది అందుకేనా..!
Updated : Jul 29, 2020
తాజాగా మూడు రాజధానుల బిల్లులు గవర్నర్‌కు చేరిన వెంటనే అమరావతినే రాజధానిగా కొనసాగించాలంటూ కన్నా గవర్నర్‌కు లేఖ రాయడం అధిష్టానానికి ఆగ్రహం కల్గించిందని సమాచారం. దీంతో అధిష్టానం ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసిందని వార్తలు వచ్చాయి. అంతే కాకుండా రాజధాని ఎక్కడ పెట్టాలో నిర్ణయించుకునే స్వేచ్చ రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని, ఆ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదని పార్టీ సీనియర్ నేతలు జి.వి.ఎల్.నరసింహారావు, పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జి సునీల్ దేవధర్ వంటి నేతలు చెబుతున్నా కన్నా పట్టించుకోలేదని అందుకే ఆయనను పక్కన పెట్టారని తెలుస్తోంది.
మరో వైపు టీడీపీ, కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన కొంత మంది నాయకులతో కలసి ఆయన ఒక గ్రూపుగా ఏర్పడి టీడీపీ విధానాలకు అనుగుణంగా పనిచేస్తున్నారని, ముఖ్యంగా రాజధాని విషయంలో పార్టీ స్టాండ్ కు సంబంధం లేకుండా అయన స్వంతంగా వ్యవహరించారనే కోపం అధిష్టానంలో ఉందంటున్నారు. అదే కాకుండా కేంద్ర స్థాయిలో ప్రతి విషయంలో తమతో సహకరిస్తున్న వైసీపీ ప్రభుత్వంపై అయన తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం కూడా కేంద్రంలోని పెద్దలకు నచ్చలేదట. దీనికి తోడు కన్నా, పురంధేశ్వరి, సుజనా మరి కొంత మంది నేతలు కలసి టీడీపీకి మేలు చేసే విధంగా వ్యవహరిస్తున్నారని పార్టీలోని ఇతర నాయకులు పదే పదే కేంద్ర పెద్దలకు ఫిర్యాదు చేయడంతో కన్నా పై వేటు పడిందని సమాచారం.